కలం, మెదక్ బ్యూరో : డీజే శబ్దాల ధాటికి ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడి ఒక మహిళకు స్వల్ప గాయాలైన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట (Ramayampet) మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా నిర్వాహకులు భారీ శబ్దాలతో డీజే సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రామాయంపేటకు చెందిన పోచమ్మల ఆంజనేయులు అనే వ్యక్తి ఇంటి సమీపంలో డీజే సౌండ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఆ విపరీతమైన వైబ్రేషన్స్‌కు వారి ఇంటి స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి.
ఈ ఘటనలో ఆంజనేయులు భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, పెచ్చులు ఊడిపడిన సమయంలో ఇంట్లో మరెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నివాస ప్రాంతాల్లో పరిమితికి మించిన శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

