కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల్లో (Asian Games) భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి సత్తా చాటింది. ఇరాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ 37-34తో విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ఆసియా క్రీడల స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మహిళల కబడ్డీలో (Womens Kabaddi) భారత్‌కు ఇది నాలుగో ఆసియా క్రీడల గోల్డ్. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ ఆధిక్యంలో కనిపించింది.
తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 22-16తో ముందంజలో ఉంది. భారత్ రక్షణ, రైడింగ్‌లో మంచి సమన్వయం చూపించింది. అయితే రెండో అర్ధభాగంలో ఇరాన్ ఒక్కసారిగా పుంజుకుంది. వరుస పాయింట్లతో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. ఒక దశలో భారత్ ఆధిక్యం కేవలం ఒక్క పాయింట్‌కు చేరింది. ఇరాన్ తిరిగి పోటీలోకి రావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. భారత్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది.
అయినా చివరి నిమిషాల్లో భారత రక్షణ కీలకంగా నిలిచింది. పెనాల్టీ పాయింట్‌తో పాటు కీలక టాకిల్స్‌తో భారత్ మళ్లీ ఆధిక్యాన్ని పెంచుకుంది. చివరకు 37-34తో మ్యాచ్‌ను ముగించి గోల్డ్ మెడల్‌ను నిలబెట్టుకుంది. ఇరాన్‌పై ఆసియా క్రీడల ఫైనల్లో భారత్‌కు ఇది మరో విజయం. 2018లో మాత్రం ఇదే ఇరాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. మొత్తంగా ఇరాన్‌తో (Iran) జరిగిన 12 కబడ్డీ మ్యాచ్‌ల్లో భారత్ 11 విజయాలు సాధించింది.
ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీలో భారత్ 2010లో థాయ్‌లాండ్‌ను ఓడించి గోల్డ్ సాధించింది. 2014లో ఇరాన్‌పై, 2018లో ఇరాన్‌పై ఓటమి తర్వాత 2022లో చైనీస్ తైపీపై విజయం సాధించింది. ఇప్పుడు 2026లో మళ్లీ ఇరాన్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ఈ విజయంతో భారత్ మహిళల కబడ్డీ జట్టు మరోసారి ఆసియా క్రీడల్లో తన టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఇదే రోజు పురుషుల కబడ్డీ జట్టు కూడా ఇరాన్‌తో ఫైనల్ ఆడనుంది. దీంతో కబడ్డీలో భారత్‌కు మరో గోల్డ్ వచ్చే అవకాశం ఉంది.

