కలం, కరీంనగర్ బ్యూరో: హక్కులతో పాటు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను ప్రతీ పౌరుడు సక్రమంగా నిర్వర్తిస్తూ, తెలంగాణ ప్రజాపాలనలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ BR అంబేద్కర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం ప్రభుత్వ విప్ వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత అనే మూడు ప్రధాన అంశాల ప్రాతిపదికగా రవాణా శాఖ ముందుకు సాగుతోందని అన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూనే, సంస్థను బలోపేతం చేసేందుకు, కార్మికుల సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
13 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
2013లో తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలోనే కరీంనగర్ బస్ స్టేషన్‌కు BR అంబేద్కర్ (Dr BR Ambedkar) పేరు పెట్టామని, సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత అదే ప్రాంగణంలో ఆమహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ఆరేపల్లి మోహన్, దొంత రాజయ్యలకు అభినందనలు తెలిపారు.
అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదని, సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే అణగారిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆత్మగౌరవం, విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు దక్కుతున్నాయన్నారు.
నిత్యం వేలాది మంది ప్రజలు సంచరించే కరీంనగర్ బస్‌స్టేషన్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రతిరోజూ ప్రయాణికులు ఆయన ఆశయాలను, రాజ్యాంగ విలువలను స్మరించుకునే అవకాశం లభిస్తుంది. అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరిస్తున్నట్లుగా ప్రస్తుతం రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను తిప్పికొడుతూ, అంబేద్కర్ స్ఫూర్తితో పాటు పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
‘చదువుకోండి, సంఘటితమవ్వండి, పోరాడండి’ అన్న అంబేద్కర్ పిలుపును యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన భావజాలాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సరితా తిరుపతయ్య యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చరణ్ కౌశిక్ యాదవ్, జిల్లా లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

