బీఆర్ఎస్ బీజేపీ క్రెడిట్ ఫైట్.. ప్రజల్లో కొత్త డౌట్?

కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడడానికి కారణం తాము వేసిన పిటిషనేనంటూ బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటున్నది. ‘అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మా పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో బలమైన వాదనలు వినిపించాం. చివరకు తీర్పు మాకే అనుకూలంగా వచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టుకు వెళ్తే, అక్కడా పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించాం’ అని బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల క్రెడిట్‌ను బీజేపీ సైతం క్లెయిమ్ చేసుకుంటున్నది. బీజేపీ తరఫున ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ (డైరీ నెం.58219/2026)పైనే సుప్రీం విచారణ చేపట్టిందని, ఆ కేసు టైటిల్‌లోనే దానం నాగేందర్ వర్సెస్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అని ఉన్నదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వ్యవహారంలో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ మధ్య క్రెడిట్ వార్ (BRS BJP Credit War) మొదలైంది. అదే సమయంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇదే తరహా పోరాటం ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న తలెత్తుతున్నది. దానం విషయంలో క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్.. మిగిలిన ఎమ్మెల్యేల విషయంలోనూ పోరాడాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తుందా? లేదా? అన్నది కీలకంగా మారింది.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడడానికి తాము చేసిన లీగల్ పోరాటమే కారణమని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకోవడంపై బీజేపీ మండిపడుతున్నది. అదే నిజమైతే పార్టీ ఫిరాయించిన మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తరహాలో పోరాడాలన్న డిమాండ్ బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నది. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీపైనా విడివిడిగా పిటిషన్లు దాఖలు చేసి.. వారిపై అనర్హత వేటు పడేలా వాదించాలని కేటీఆర్, హరీశ్‌రావును బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మాటల్లో గాంభీర్య ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్..

దానం నాగేందర్ తరహాలోనే మిగిలిన 8 మందిపై కోర్టుల్లో న్యాయపోరాటం ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్ కారణంగానే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిందని బలంగా వాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల విషయంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎలాంటి లీగల్ ఫైట్ చేస్తుందనేది కీలకంగా మారింది.

బీఆర్ఎస్ వైఖరేంటి?

బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారంటూ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై గతంలోనే బీఆర్ఎస్ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. అనర్హత పిటిషన్లను నిర్దిష్ట గడువులోగా తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌ను న్యాయస్థానాలు ఆదేశించాయి. ఆ ప్రకారం స్పీకర్ విడివిడిగా ఒక్కొక్కరినీ విచారించారు. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి తరఫు న్యాయవాదుల వాదనలను విని.. ఎవరూ పార్టీ మారినట్టు ఆధారాల్లేవని, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చారు.

అయితే దానం నాగేందర్‌ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ తరఫున పాడి కౌశిక్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ రెండింటినీ కలిపి హైకోర్టు ఒకటిగానే విచారించింది. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడినందున మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఇకపైన ఎలాంటి లీగల్ ఫైట్ చేస్తుంది? విడివిడిగా పిటిషన్లు దాఖలు చేస్తుందా? వారిపైనా అనర్హత వేటు పడేలా వాదనలు వినిపిస్తుందా? అనేది కీలకంగా మారింది.

లీగల్ ఫైట్ చేస్తుందా?

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ను తప్పుపడుతున్న బీఆర్ఎస్.. నైతిక విజయం కోసం మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తరహాలో లీగల్‌గా కొట్లాడాలన్న డిమాండ్ బీజేపీ నుంచి మాత్రమే కాకుండా గులాబీ లీడర్ల నుంచీ వ్యక్తమవుతున్నది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు విషయంలో క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకుంటున్నందున పార్టీ ఫిరాయించిన అందరి విషయంలోనూ ఇదే స్ఫూర్తిని ప్రదర్శించాలన్న డిమాండ్ వస్తున్నది.

దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రిజైన్ చేసి మళ్లీ గెలవాలని బీఆర్ఎస్ సవాల్ విసురుతున్న నేపథ్యంలో.. ఆ పరిస్థితి కోర్టుల ద్వారా తలెత్తేలా బీఆర్ఎస్ న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి తిరిగి ఎన్నికైతే.. ఆ ఊపుతో ఎనిమిది మందీ స్వచ్ఛందంగా రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్తారా? లేక బీఆర్ఎస్ నేతలు ఇక్కడి ఫలితాన్ని చూసిన తర్వాత ఆచితూచి అడుగేస్తారా? అన్న చర్చలూ ప్రజల్లో మొదలయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>