కలం, స్పోర్ట్స్ : భారత యంగ్ అథ్లెట్ శైలీ సింగ్ (Shaili Singh) ఆసియా గేమ్స్ (Asian Games)లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. శైలీ సింగ్ ప్రయాణం అనుకోకుండా ప్రారంభమైంది. 2017లో పేపర్ ప్రకటన చూసి అథ్లెటిక్స్ ఎంపికలకు వెళ్లినట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత బెంగళూరులోని అంజు బాబీ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో చేరింది. అక్కడ శిక్షణ పొందాక పలు రికార్డులను తిరగరాసింది.
హైజంప్, 100 మీటర్ల పరుగు నుంచి అనుకోకుండా లాంగ్ జంప్‌లోకి మారానని శైలీ (Shaili Singh) వెల్లడించింది. లాంగ్ జంప్‌లో ఇసుకను చూస్తే చిన్నపిల్లలా ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పింది. భారత దిగ్గజ అథ్లెట్ అంజు బాబీ జోర్జ్ ఆమెకు మార్గదర్శకంగా నిలిచింది. అంజు అందించే ప్రోత్సాహం తనకు ఎంతో శక్తినిస్తుందని శైలీ తెలిపింది. సహచర అథ్లెట్ ఆన్సీ సోజన్‌తో తనకు ఆరోగ్యకరమైన పోటీ ఉందే తప్ప శత్రుత్వం లేదని స్పష్టం చేసింది. ఇద్దరం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామని పేర్కొంది.
గత నాలుగేళ్లలో వీపు, కాలి వేలు, యాంకిల్ గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడినట్లు శైలీ గుర్తు చేసుకుంది. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించింది. అభిమానుల నుంచి వచ్చే ప్రోత్సాహమే తన శక్తి అని శైలీ వ్యాఖ్యానించింది. మైదానంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ఏకైక లక్ష్యమని స్పష్టం చేసింది.

