కలం, జగిత్యాల: జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారిపై జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ వద్ద చేపడుతున్న వంతెన నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) పరిశీలించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాయికల్ మండలానికి వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యలో గాంధీనగర్ వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంతెన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి తాగు నీటిని సరఫరా చేస్తున్న ప్రధాన పైప్‌లైన్ దెబ్బతినడంతో పట్టణ ప్రజలకు తాగు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. తక్షణమే పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ స్వప్న గిరిధర్, సేవాదళ్ సెక్రటరీ ముకేష్ ఖన్నా, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

