కలం, నిర్మల్: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో రైతు గర్జన (Rythu Garjana) నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు పార్టీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల నుంచి సుమారు 25 వేల మందిని సమీకరించేలా పార్టీ నాయకులు కార్యాచరణ రూపొందించారు.
కేటీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో నిర్మల్‌కు రానున్న నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లన్నీ గులాబీ అలంకరణతో కనిపిస్తున్నాయి. కొండాపూర్ జంక్షన్ నుంచి శివాజీ చౌక్, ఆర్డీఓ కార్యాలయం, వివేక్ చౌక్, బస్టాండ్ వరకు భారీ ఫ్లెక్సీలు, గులాబీ జెండాలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. దీంతో నిర్మల్ పట్టణమంతా గులాబీమయంగా మారింది. సభ(Rythu Garjana)కు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు చివరి దశ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.
Also Read : మోదీతో ఐ కాంటాక్ట్ పై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

