నారాయణ పేటలో e-HRMS శిక్షణ.. ఉద్యోగులకు కలెక్టర్ దిశానిర్దేశం!

కలం, నారాయణ పేట: డిజిటల్ పాలనపై అవగాహన పెంపొందించుకుని ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్, ఆన్‌లైన్ సేవలను ప్రతి ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రికార్డులు, వ్యక్తిగత వివరాలు, సేవా సంబంధిత కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఈ-హెచ్ఆర్ఎంఎస్ (e-HRMS) విధానంపై మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అవగాహన, శిక్షణ (e-HRMS Training) కార్యక్రమం నిర్వహించారు.

డిజిటల్ పాలన ప్రాధాన్యత గుర్తించాలి..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణకు హాజరైన ప్రతి ఒక్కరూ డిజిటల్ పాలన ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. కాలానికి అనుగుణంగా ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ విధానంలోకి మారుతున్న నేపథ్యంలో ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్ (e-HRMS) ద్వారా ఉద్యోగులకు సంబంధించిన సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ వ్యవస్థలో ప్రధానంగా మూడు విభాగాలు ఉన్నాయని, మొదటిది హెచ్‌ఆర్‌ఎంఎస్‌కు సంబంధించిన ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, రెండవది విధులకు సంబంధించిన వర్క్ మాడ్యూల్, మూడవది సెలవుల మంజూరు, ఇతర సర్వీసు సంబంధిత కార్యకలాపాలు. ఈ సేవలన్నీ ఒకే డిజిటల్ వేదిక ద్వారా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు.

పాత సర్వీస్ బుక్స్‌కు స్వస్తి..

గతంలో ఉద్యోగుల సర్వీసు రికార్డుల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని, పాత రికార్డులు, సర్వీస్ బుక్స్, సెలవుల వివరాలు, ఇంక్రిమెంట్లు, సంతకాలు, గ్యాప్ పీరియడ్స్ వంటి అంశాల కోసం పాత ఫైళ్లను పరిశీలించాల్సి వచ్చేదని, కొన్నిసార్లు రికార్డుల్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల కూడా సమస్యలు తలెత్తేవని, కొత్త డిజిటల్ విధానంతో ఈ ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల వివరాలు డిజిటల్ సంతకాలతో ఆన్‌లైన్‌లో భద్రపరచబడతాయన్నారు. అవసరమైనప్పుడు వాటిని సులభంగా పరిశీలించవచ్చని ఆమె స్పష్టం చేశారు. అందువల్ల ఈ శిక్షణను ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధగా తీసుకోవాలని కోరారు.

ఆన్‌లైన్ అటెండెన్స్ విధానం నమోదు చేసుకోవాలి

ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా అధికారులు, హెచ్‌ఓడీలు, సంబంధిత సిబ్బంది పూర్తిస్థాయిలో పాల్గొని ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మీరు నేర్చుకోవడంతో పాటు మీ కింద పనిచేసే సిబ్బందికి కూడా ఈ వ్యవస్థపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్ అటెండెన్స్ విధానాన్ని ఇప్పటికే ప్రారంభించినప్పటికీ, ఇంకా కొంతమంది అధికారులు, సిబ్బంది కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా వినియోగించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ప్రతి హెచ్‌ఓడీ తన పరిధిలోని అధికారులందరూ, సిబ్బంది అందరూ ఆన్‌లైన్ అటెండెన్స్ విధానంలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

ఆన్‌లైన్ అటెండెన్స్‌పై ప్రత్యేక నిఘా..

ఈ నెల 10వ తేదీ నుంచి 31 వరకు అటెండెన్స్ నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తామని, ఈ నెల 22, 23 తేదీల్లో ఆన్‌లైన్ అటెండెన్స్ వివరాలను పరిశీలిస్తామన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి జీతాల బిల్లుల అప్‌లోడింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జీతాల బిల్లులు సమర్పించే ముందు సంబంధిత శాఖల నుంచి ఆన్‌లైన్ అటెండెన్స్ వివరాలు సక్రమంగా నమోదయ్యాయా లేదా అన్నది పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత నెల జీతాలను కేవలం ఆన్‌లైన్ అటెండెన్స్ ఆధారంగా నిర్ణయించడం లేదని, అయితే ఈ నెలలో ప్రతి ఒక్కరి ఆన్‌లైన్ అటెండెన్స్‌ను ప్రత్యేకంగా పరిశీలిస్తామని తెలిపారు.

కాబట్టి రాబోయే పది రోజుల్లో ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఈ విధానంలోకి రావాలని తేల్చి చెప్పారు. కొత్త కలెక్టరేట్ భవనంలోకి వెళ్లే సమయానికి ప్రతి ఒక్కరికీ ఈ విధానం అలవాటు కావాలన్నారు. వచ్చే నెల నుంచి ఉద్యోగుల అటెండెన్స్, సెలవుల నమోదు, సంబంధిత సర్వీసు వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ విధానం వల్ల ఉద్యోగులకు ఎంతో సమయం ఆదా అవుతుందని, గతంలో సర్వీస్ బుక్‌లో వివరాలు నమోదు చేయడం, సెలవుల కోసం దరఖాస్తులు సమర్పించడం, రికార్డుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి సమస్యలు ఉండేవని, ఇకపై ఈ ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు.

డిజిటల్ సేవలు వినియోగించుకోవడం మనందరి బాధ్యత

ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆధునిక డిజిటల్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని, పాత విధానాల నుంచి ఆధునిక డిజిటల్ విధానాలకు మారుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ మూడు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకుని, మీరు నేర్చుకున్న విషయాలను మీ సిబ్బందికి కూడా వివరించి, 100 శాతం డిజిటల్ వ్యవస్థను అమలు చేసే దిశగా కృషి చేయాలని ఆమె కోరారు. అందరి సహకారంతో డిజిటల్ పాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్తామని కలెక్టర్ ఆశా భావం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ సంచాలకులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణా కార్యక్రమం కొనసాగింది.

ప్రస్తుతం అమలులో ఉన్న హెచ్ఆర్ఎంఎస్ (HRMS) విధానం స్థానంలో ప్రవేశపెడుతున్న నూతన ఈ-హెచ్ఆర్ఎంఎస్ విధానానికి మార్పు, సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగుల వ్యక్తిగత, సర్వీసు వివరాల నమోదు, వివిధ పరిపాలనా ప్రక్రియలు, సాఫ్ట్‌వేర్ వినియోగ విధానం, అందుబాటులో ఉండే సదుపాయాలపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి డీటీఓ రాజ్ గోపాల్ చారీ నాయకత్వం వహించి, నూతన విధానం అమలుకు సంబంధించిన అంశాలను వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>