కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక (Khairatabad Bypoll) తప్పదని స్పష్టమైన నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున బాధ్యత ఎవరికి అనేది కీలకంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడో ఉప ఎన్నిక ఇది. తొలుత జరిగిన కంటోన్మెంట్, ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ రెండూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైనప్పటికీ ఓటమి చవిచూడక తప్పలేదు. ఇప్పుడు ఖైరతాబాద్ సైతం బీఆర్ఎస్‌కు సిట్టింగ్ స్థానమే. ఇప్పటివరకు జరిగిన రెండు ఉప ఎన్నికల బాధ్యతలను హరీశ్‌రావు చూసుకున్నారు.
ఈసారి కూడా ఆయనకే అప్పగిస్తారా? లేక స్వయంగా కేటీఆర్ చేపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. వరుసగా రెండు స్థానాలను కోల్పోయిన పరిస్థితుల్లో మూడోది కూడా చేజారకుండా పార్టీ ప్రతిష్టను సీరియస్‌గా తీసుకుని కేటీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో దానం నాగేందర్ పొలిటికల్ గ్రాఫ్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఖైరతాబాద్‌లో ప్రజల నాడి ఎలా ఉంది? ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు? ఇలాంటి అంశాలపై సర్వే నిర్వహించి వెల్లడయ్యే అంచనాలకు అనుగుణంగా కేటీఆర్ డెసిషన్ తీసుకోనున్నారు.
‘సర్’ కోసం సదస్సులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘సర్’పై కేటీఆర్ స్వయంగా సదస్సులు నిర్వహించి కేడర్‌కు పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘సర్’ ప్రక్రియను అంత సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి హ్యాట్రిక్ విజయానికి బ్రేకులు వేసేలా స్వయంగా రంగంలోకి దిగుతారా? లేక హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పజెప్పి ఆయనకు తోడుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి సీనియర్ లీడర్లను అటాచ్ చేస్తారా? లేదంటే ఒకటి రెండు సభల్లోనైనా కేసీఆర్ పాల్గొనేలా ప్లాన్ చేస్తారా?.. వీటికి రానున్న రోజుల్లో సమాధానం రానున్నది. ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ విజయానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది సర్వేలో తేలిన తర్వాతే కేటీఆర్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నది.
ప్రజలు ఎవరివైపు?
కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, సీఎం రేవంత్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామంటూ రియలైజ్ అయ్యారని.. ఇలా కేటీఆర్ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఫలితం ఆయన చేసిన వ్యాఖ్యల్లోని నిజానిజాలను తేల్చనున్నది. కేటీఆర్ చేసిన కామెంట్లలో నిజం ఉన్నట్లయితే ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమవుతుంది. ఒకవేళ కేడర్‌లో జోష్ నింపేందుకు లేదా ప్రజల్లో హైప్ క్రియేట్ చేసేందుకు చేసిన వ్యాఖ్యలే అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరోలా ఉంటుంది.
మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ చేసిన అభివృద్ధి, సంస్కరణల కారణంగానే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో భారీగా ఓడిపోయినా ఇక్కడ 16 స్థానాలను కట్టబెట్టారని ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో గొప్పగా చెప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అర్బన్ సీట్లపైనే ఎక్కువే ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఖైరతాబాద్ ఆ పార్టీకి చాలా కీలకమైన ఉప ఎన్నిక కావడంతో కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలని శ్రేణుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశమున్నది.

