కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసింది. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG TMARS)ను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రత్యేక బ్యూరోగా పనిచేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా దీనికి అధికార పరిధి ఉంటుంది. అదనపు డీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి బ్యూరో డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
కమిషనరేట్లు, జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ట్రాఫిక్ విభాగాలకు సాంకేతికత, శిక్షణ, ప్రమాణాలు, డేటా విశ్లేషణ, సమీక్ష వంటి అంశాల్లో ఒకే విధమైన వ్యవస్థ తీసుకురావడం టీజీ–టీ మార్స్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ వింగ్స్, ఈ-చలాన్ కార్యకలాపాలపై బ్యూరో పర్యవేక్షణ ఉంటుంది. అయితే సంబంధిత కమిషనర్లు, ఎస్పీలకు ఉన్న రోజువారీ కార్యకలాపాల నిర్వహణ అధికారాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్..
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఔటర్ రింగ్ రోడ్డు, ప్రభుత్వం గుర్తించిన రాష్ట్ర రహదారులపై హైవే పెట్రోల్ యూనిట్లు పనిచేయనున్నాయి. ప్రమాదాలు, ఇతర రహదారి ఘటనలకు వేగంగా స్పందించడం, పెట్రోలింగ్ వ్యవస్థను పర్యవేక్షించడం వీటి బాధ్యతల్లో భాగమే. టీజీ–టీ మార్స్ పరిధిలో రోడ్డు ప్రమాదాలపై వృత్తిపరమైన, ఫోరెన్సిక్ విధానంలో దర్యాప్తు చేపట్టేలా వ్యవస్థను రూపొందించారు. ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన డేటాను విశ్లేషించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం, పునరావృతంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై దృష్టి పెట్టడం, కేసుల ప్రాసిక్యూషన్‌ను పర్యవేక్షించడం బ్యూరో విధుల్లో ఉన్నాయి. ఐఆర్‌ఏడీ/ఈడీఏఆర్ ప్లాట్‌ఫామ్‌పై పోలీసుల పనితీరును కూడా బ్యూరో పర్యవేక్షిస్తుంది.
ఈ-చలాన్, టెక్నాలజీపై పర్యవేక్షణ..
ట్రాఫిక్ నిబంధనల అమలులో భౌతిక చర్యలతో పాటు ఎలక్ట్రానిక్ పద్ధతులను ఉపయోగించనున్నారు. ఈ-చలాన్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ పరికరాలు, ట్రాఫిక్ సిగ్నలింగ్, అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల నిర్వహణలో టీజీ–టీ మార్స్ కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్రస్థాయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిర్వహించే బాధ్యత కూడా బ్యూరోకు అప్పగించారు.
రైలు, మెట్రో భద్రతకు బాధ్యత..
టీజీ–టీ మార్స్ పరిధి రోడ్డు రవాణాకే పరిమితం కాదు. ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లు, మెట్రో రైలు, భవిష్యత్ హైస్పీడ్ రైలు/బుల్లెట్ రైలు, ఇతర రైలు రవాణా వ్యవస్థల భద్రతపై పోలీసింగ్ బాధ్యతలు కూడా బ్యూరో పరిధిలోకి వస్తాయి. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ స్పందన, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే శాఖ, మెట్రో రైలు యంత్రాంగంతో సమన్వయం చేయడం కూడా విధుల్లో భాగంగా ఉంటుంది.
ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఫండ్..
బ్యూరో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసుల ద్వారా వసూలయ్యే కాంపౌండింగ్ ఫీజులు, జరిమానాల నుంచి 40 శాతం మొత్తాన్ని ప్రతి నెల ఈ ఫండ్‌లో జమ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులను ట్రాఫిక్ మేనేజ్మెంట్, హైవే పెట్రోలింగ్, సాంకేతిక పరికరాలు, ఎన్ఫోర్స్మెంట్ అనలిటిక్స్, అత్యవసర రోడ్డు పనులు, ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమం, రైలు భద్రతకు సంబంధించిన అవసరాలకు వినియోగించనున్నారు.
కొత్త పోస్టులు.. 300 పోస్టుల బదిలీ..
ప్రతి పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) పోస్టును, ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ (ట్రాఫిక్) పోస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజీపీ ఆధీనంలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న 300 పోస్టులను సిబ్బందితో సహా టీజీ–టీ మార్స్‌కు బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాఫిక్ సిబ్బంది, హైవే పెట్రోల్ సిబ్బంది, బ్యూరోలో పనిచేసే వారికి హై-విజిబిలిటీ దుస్తులు, రక్షణ పరికరాలు, బాడీ-వోర్న్ కెమెరాలు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
మూడేళ్ల సాధారణ పదవీకాలం..
బ్యూరో హెడ్‌క్వార్టర్స్, హైవే పెట్రోల్ యూనిట్లు, స్టేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీలో పనిచేసే పోలీసు సిబ్బందికి సాధారణంగా మూడేళ్ల పదవీకాలం ఉండనుంది. ప్రత్యేక అనుమతి లేకుండా ఐదేళ్లకు మించి కొనసాగరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్లో అనుభవాన్ని పోలీస్ శాఖలోని ఇతర కీలక పోస్టులకు తీసుకెళ్లేలా భవిష్యత్‌లో కొన్ని పోస్టులకు కనీసం రెండేళ్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనుభవాన్ని తప్పనిసరి చేయనున్నారు.

