కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు భూములపై పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని (Minister Ponguleti) కోరారు. హైదరాబాద్ సచివాలయంలో రేకొండ రైతులతో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రేకొండలో కొంతమంది రైతులు, వారి కుటుంబాలు సుమారు 60 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. తమ శ్రమతో భూములను సాగుకు అనుకూలంగా అభివృద్ధి చేసుకుని వివిధ పంటలు పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని మంత్రికి వివరించారు.
రెవెన్యూ అధికారుల గతేడాది నివేదిక ప్రకారం మొత్తం 103.03 ఎకరాల భూమి సంబంధిత లబ్ధిదారుల అనుభవంలో ఉన్నట్లు తేలిందన్నారు. సర్వే నంబర్ 927లో కాలువ నిర్మాణం కోసం 2.09 ఎకరాల భూమిని సేకరణకు నోటిఫై చేసినట్లు, కాలువ విస్తీర్ణాన్ని మినహాయించిన తర్వాత 2.04 ఎకరాలు రైతుల స్వాధీనంలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. కాలువ భూసేకరణకు సంబంధించి అవార్డు జారీ లేదా పరిహారం చెల్లింపునకు రికార్డులు లేవని అధికారులు తెలిపినట్లు చాడ పేర్కొన్నారు. దీర్ఘకాలంగా సాగు చేస్తున్న రైతుల స్వాధీనం, సాగు, భూముల అభివృద్ధి, కుటుంబాల జీవనాధారాన్ని పరిగణనలోకి తీసుకుని అర్హులైన రైతులకు భూములను కేటాయించి అసైన్ చేయాలని కోరారు.
అలాగే సర్వే నంబర్ 927కు సంబంధించిన భూసేకరణ, కాలువ ఆక్రమించిన వాస్తవ విస్తీర్ణం, అవార్డు, పరిహారం చెల్లింపుల రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సీలింగ్ కేసులను పునఃపరిశీలించి, చట్టబద్ధంగా విక్రయించిన లేదా బదలాయించిన భూములను మినహాయించి వాస్తవ మిగులు భూమిని నిర్ణయించాలని కోరారు. దీర్ఘకాలంగా సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు నామమాత్రపు ధరకు భూములు కేటాయించి, పట్టాలు ఇచ్చేలా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని చాడ వెంకటరెడ్డి మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో రైతులు చాడ శ్రీధర్‌రెడ్డి, పరిపాటి వెంకటరెడ్డి, బావు రవీందర్, సుధాకర్, రాగుల సంపత్‌రెడ్డి, మిరియాల కనకారెడ్డి, చాడ సతీష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

