పోతునూరు–పులిచర్ల రోడ్డుకు మోక్షమెప్పుడో?

కలం, నాగార్జునసాగర్: పెద్దవూర మండల పరిధిలోని పోతునూరు–పులిచర్ల ప్రధాన రహదారి (Pothunuru–Pulicherla Road) దుస్థితిని చూస్తే ఎవరికైనా అయ్యో అనక తప్పదు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంత ప్రజల రహదారి రాత మాత్రం మారడం లేదు. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడి, ప్రయాణమంతా నరకయాతనగా మారింది. అసలు గుంతల్లో రోడ్డు ఉందో.. రోడ్డులోనే గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రహదారి గుండా నిత్యం వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే అడుగుకో గుంత ఎదురవుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గుంతల్లో ప్రయాణించడం వల్ల తరచూ వాహనాలు ప పాడైపోయి, వేలాది రూపాయల మరమ్మతు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట ఏదోలా ప్రయాణించినా, రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణమంటే మృత్యువుతో చెలగాటం ఆడటమేనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చీకటిలో గుంతలు సరిగ్గా కనిపించక అకస్మాత్తుగా వాహనాలు పడిపోవడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పలువురు ఈ రోడ్డుపై పడి తీవ్ర గాయాల పాలయ్యారని గ్రామీణులు తెలిపారు.

పట్టించుకోని పాలకులు, అధికారులు..

ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా ఈ సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించడం, గెలిచాక రోడ్డు (Pothunuru–Pulicherla Road) వైపు కన్నెత్తి చూడకపోవడం ఆనవాయితీగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేవలం గుంతలు పూడ్చడమే కాకుండా, పోతునూరు– పులిచర్ల మధ్య పూర్తిస్థాయిలో నూతన బిటి రహదారిని నిర్మించి, తమ ప్రాణాలకు భద్రత కల్పించాలని పోతునూరు, పులిచర్ల ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>