కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ 2026 రోయింగ్ పురుషుల డబుల్ స్కల్స్‌లో సల్మాన్ ఖాన్ (Salman Khan Rower) కాంస్య పతకం సాధించారు. సహచరుడు సత్నామ్ సింగ్‌తో కలిసి రేసును 6:13.25 నిమిషాల్లో పూర్తి చేశారు. చైనాకు స్వర్ణం, ఉజ్బెకిస్తాన్‌కు వెండి దక్కాయి. ఉత్తరప్రదేశ్ అమేథీకి చెందిన సల్మాన్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆరుగురు తోబుట్టువుల బాధ్యత ఆయనపై పడింది. దీంతో ఆర్మీ కల పక్కనబెట్టి ఢిల్లీలో ఉబెర్ క్యాబ్ తోలడం ప్రారంభించారు. ఓ మిత్రుడి సలహాతో సల్మాన్ మళ్లీ ఆర్మీ వైపు అడుగులు వేశారు. నాలుగు నెలల కఠిన శిక్షణ తర్వాత 2018లో బాంబే ఇంజినీర్ గ్రూప్‌లో చేరారు. ఆయన ఎత్తు, దృఢత్వాన్ని చూసి కోచ్‌లు రోయింగ్‌లోకి తెచ్చారు.
మొదట్లో ఆసక్తి లేకపోయినా, కోచ్‌ల ఒత్తిడితో పడవ ఎక్కారు. తొలి పోటీలోనే వెండి పతకం గెలిచి ఆత్మవిశ్వాసం సాధించారు. 2021లో పూణే ఆర్మీ రోయింగ్ నోడ్‌కు ఎంపికయ్యారు. 2022 జాతీయ క్రీడల్లో స్వర్ణం, 2023లో ఆసియన్ గేమ్స్ విజేతపై గెలుపుతో గుర్తింపు సాధించారు. 2024 ఆసియన్ కప్‌లో పసిడి నెగ్గి నాయిబ్ సుబేదార్‌గా ప్రమోషన్ పొందారు. కుటుంబ బాధ్యతల నుంచి మొదలైన సల్మాన్ ప్రయాణం.. తల్లి, భార్య, కోచ్‌ల మద్దతుతో ఆసియా గేమ్స్ వేదికపై ముగిసింది. పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా జయించవచ్చని ఆయన నిరూపించారు.

