కలం, నల్లగొండ బ్యూరో: మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MG University) లో ఘోర ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ యూనివర్సిటీ ఉద్యోగి అతివేగంగా, నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడుపుతూ క్యాంపస్‌లోనే విద్యార్థులను ఢీకొట్టడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ప్రమాదంలో వర్సిటీకి చెందిన నితిన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో అతడి కుడికాలు విరిగిపోయింది. గాయపడిన విద్యార్థిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన ఉద్యోగి గతంలోనూ పలుమార్లు మద్యం సేవించి విధులకు హాజరైనట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయాన్ని గురించిన యాజమాన్యం అతడిని సస్పెండ్ కూడా చేసింది. అయితే పునఃప్రవేశం పొందిన తర్వాత కూడా అతని వైఖరిలో మార్పు రాకపోవడం, మళ్లీ మద్యం మత్తులోనే ట్రాక్టర్ నడిపి విద్యార్థి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. క్యాంపస్‌లోకి ప్రవేశించే విద్యార్థులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించే యాజమాన్యం, విధుల్లో ఉండే ఉద్యోగులకు ఎందుకు పరీక్షలు చేయట్లేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. వర్సిటీలో వాహనాలు నడిపే ప్రతీ ఉద్యోగికి విధిగా బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలన డిమాండ్ చేశాయి.
సెక్యూరిటీ ఆఫీసర్‌పై చర్యలకు డిమాండ్..
క్యాంపస్‌లో భద్రతను పర్యవేక్షించడంలో సెక్యూరిటీ ఆఫీసర్ పూర్తిగా విఫలమయ్యారని విద్యార్థులు మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు, భద్రతా లోపాలకు కారణమైన సెక్యూరిటీ ఆఫీసర్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థి నితిన్ పూర్తిగా కోలుకునే వరకు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను యూనివర్సిటీ యాజమాన్యమే భరించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు.

