కలం, వనపర్తి: పెద్దమందడి మండలం మంగంపల్లి (Mangampalli) గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 కబడ్డీ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లాలోని 15 మండలాలకు చెందిన బాలబాలికల జట్లు పోటీల్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించాయి. అమరచింత, ఆత్మకూర్, చిన్నంబావి, ఘనపూర్, గోపాల్‌పేట, కొత్తకోట, పానగల్, పెబ్బేరు, పెద్దమందడి, మదనాపూర్, రేవల్లి, వనపర్తి, వీపనగండ్ల, శ్రీరంగాపూర్, ఏదుల మండలాల జట్లు పాల్గొన్నాయి. ఖిల్లా ఘణపురం మండల పీఈటీ చిట్టెమ్మ సమన్వయంతో పోటీలు నిర్వహించారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే..
15 మండలాల ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడా ఉపాధ్యాయులు క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కబడ్డీ వంటి క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, సమన్వయం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, ఎంపీడీవో పరిణితి, ఎస్‌జీఎఫ్ ఇన్‌ఛార్జి కుమార్, సర్పంచి రమేష్ నాయక్, గ్రామ పెద్ద వెంకటరామిరెడ్డి, మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ వైస్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, రాఘవేందర్ పాల్గొన్నారు.

