కలం, వెబ్ డెస్క్: మూసీ నదిలో ఉన్న కాలుష్యం కంటే కొంతమంది నేతల మనసుల్లో ఎక్కువ విషం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కడుపునిండా విషం పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది నేతల కంటినిండా విషం ఉందని.. ఆ విషంతో అంతా కాలి బూడిద అయిపోతుందన్నారు. మేము మూసీ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతల కడుపు ఎందుకు మండుతోందని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ ఒప్పుకుంటుందా? లేదా? అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టులో ఇండ్లు కూలిపోయిన నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించిన డీపీఆర్‌ను సభలో ప్రవేశపెడతామని.. అసెంబ్లీలో అందరితో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్తామని చెప్పారు. కమీషన్లు తీసుకోవడం బీఆర్ఎస్ నేతలకు అలవాటేనని ఆరోపించారు. వారిలాగా తాము కమీషన్లు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళన చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్యం నుంచి కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో నగరీకరణ పెరుగుతోందని అందులో భాగంగానే తాము అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మూసీ మొత్తం మురికితో నిండిపోయిందని.. అక్కడి నిర్వాసితులను తాము కాపాడతామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూండగా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు కంటినిండా విషం పెట్టుకున్నారన్నారు. మూసీ ప్రాజెక్టులోని నిర్వాసితులను తాము ఆదుకుంటామని చెప్పారు. ప్రపంచస్థాయి సంస్థలకు కాంట్రాక్టులకు అప్పగించి మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
మూసీ, ఈసా నదుల సంగమం
మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన చోట బాపూ ఘాట్ నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మానవ నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి చెందిందన్నారు. కాకతీయుల నుంచి నిజాం నవాబుల వరకు సాగు, తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. 1908లో నగరాన్ని వరద ముంచెత్తితే.. వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిజాం సర్కారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించిందని చెప్పారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇప్పటికీ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లామన్నారు. లండన్ థేమ్స్ రివర్, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో తమ ప్రతినిధి బృందం పర్యటించిందని చెప్పారు.
ప్రపంచస్థాయి నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకున్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గుజరాత్ సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించారని.. అక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసుకున్నారని చెప్పారు. మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్నారు. కంపెనీల కాలుష్యం నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయని.. ఆ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడి ప్రజలే తనకు ఈ విషయం చెప్పారన్నారు. ప్రపంచ నగరాలు అభివృద్ధి చెందుతున్న విధానాలను చూశాక మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించాల్సిందేనని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కన్సల్టెన్సీలను అపాయింట్ చేసుకుని మూసీ ప్రక్షాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పామన్నారు.
బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ రెండు నదులు కలిసే చోట వీ షేప్‌లో అభివృద్ధి జరుగుతోందన్నారు. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నామన్నారు. 20 టీఎంసీలలో 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీ లో నిరంతరం శుద్ధమైన నీరు పాటించేందుకు ఉపయోగించాలనుకుంటున్నామని చెప్పారు.
మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేస్తాం
మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి మూసీ నదిని అభివృద్ధి చేస్తామన్నారు. ఏడీబీ బ్యాంకు రూ. 4 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించిందన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నామని ప్రభుత్వం చెప్పారు. ఓల్డ్ సిటీని మేం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు.


