కలం, ఖమ్మం బ్యూరో: నర్సింగ్ విద్యార్థిని హరిణి (Harini) కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను ఎంతమాత్రం వదిలేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. హరిణి హత్య కేసులోని నిందితులను వెంటనే గుర్తించి, అత్యంత కఠినంగా శిక్షించాలని బుధవారం ఆయన పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి ఖమ్మంలో నర్సింగ్ విద్యనభ్యసిస్తోంది. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె, వచ్చిన మరుసటి రోజే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై సమాచారం అందగానే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
హరిణి మృతదేహాన్ని సందర్శించిన ఆయన, తీరని శోకంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువ విద్యార్థిని ఇలా దారుణంగా బలికావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. సమాజంలో మహిళలకు భద్రత కరువవుతున్న ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచాలని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల సహా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, ఉప సర్పంచ్ పాషా తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

