కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో తరచూ హనీ ట్రాప్(Honey Trap) కేసులు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బడా బాబులే లక్ష్యంగా అందమైన అమ్మాయిలతో వీడియో కాల్స్ మాట్లాడించి, ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్(blackmail)కు దిగే ఈ ఆన్‌లైన్ వలలో ఎంతోమంది రాజకీయ, వ్యాపార ప్రముఖులు చిక్కుకుంటున్నారు. తాజాగా జగిత్యాల(Jagtial) జిల్లాలో మరో హనీ ట్రాప్ బయటపడింది. స్థానిక రౌడీ షీటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సీక్రెట్ దందాను పోలీసులు గుర్తించారు.
స్థానిక రౌడీ షీటర్ రాజు సులభంగా డబ్బు సంపాదించేందుకు హనీ ట్రాప్‌ను ఎంచుకున్నాడు. ధనవంతులను టార్గెట్ చేస్తూ మహిళలతో వల వేసి, నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రాజు దందాకు స్వప్న అనే మరో మహిళ కూడా సహకరిస్తోంది. వీరిద్దరూ బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవా, నర్సయ్య తదితరులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇప్పటికే పలువురు ధనవంతులను బ్లాక్ మెయిల్ చేసి లక్షల్లో దోపిడీ చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులతో సన్నిహితంగా మెలగరాదని సూచించారు.


