వరంగల్​ లో వినాయకుడికి ఘన వీడ్కోలు

కలం, వరంగల్ : తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న బొజ్జ గణపయ్యకు వరంగల్‌ (Warangal) నగరం ఘనంగా వీడ్కోలు పలుకుతోంది. నగరంలోని డివిజన్లు, కాలనీలు, ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల నుంచి గణనాథుల నిమజ్జన (Ganesh Immersion) శోభాయాత్రలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఉదయం నుంచే గణేశ్‌ విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై అలంకరించి నిమజ్జన ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చిన్నారుల నుంచి పెద్దల వరకు తారతమ్యం లేకుండా శోభాయాత్రల్లో పాల్గొంటున్నారు. డప్పుచప్పుళ్లు, భక్తిగీతాలు, గణపయ్య నామస్మరణలు, యువత నృత్యాలతో వరంగల్‌ వీధులు సందడిగా మారాయి. ప్రధాన రహదారులు, కాలనీల్లో ఎక్కడ చూసినా గణేశ్‌ శోభాయాత్రలే కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా చిన్నారులు రంగురంగుల దుస్తుల్లో నృత్యాలు చేస్తూ, చేతుల్లో జెండాలు పట్టుకుని సందడి చేస్తుండటంతో వాడవాడలా పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబాలతో కలిసి తరలివచ్చిన భక్తులు గణనాథుడికి చివరి పూజలు నిర్వహించి, నిమజ్జనానికి తరలిస్తున్నారు.

వరంగల్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన వేడుకల సందర్భంగా పోలీసులు, అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాకపోకలు, నిమజ్జన మార్గాలపై పర్యవేక్షణ కొనసాగుతోంది. భక్తిశ్రద్ధలు, ఆటపాటల మధ్య గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ.. ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా’ అంటూ భక్తులు నినదిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>