SRSP ప్రాజెక్ట్‌కు నీటి కరువు.. ఆయకట్టుకు గుబులు

కలం, నిజామాబాద్ బ్యూరో: ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టు. ఈసారి వానాకాలంలో ఇంతవరకు పూర్తిస్థాయిలో నిండ లేదు. ఏటా వానాకాలంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జలాశయం నిండడం, ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటిని అందించేది. కానీ ఈ ఏడాది ఎల్ నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం చివరి దశకు వచ్చినా ప్రాజెక్టులో సగానికి కొంత ఎక్కువగా నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు కింద ఎగువ మానేరు వరకు 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాకతీయ కాల్వ ద్వారా నీటి విడుదల చేయక పోవడంతో ఆశించిన స్థాయిలో పంటలు సాగు చేయలేదు.

ఖరారు కాని సాగునీటి ప్రణాళిక..

ప్రాజెక్టులో 50 టీఎంసీలు కూడా లేవు. దీంతో అధికారులు వానాకాలం పంటలకు కూడా నీటి విడుదలపై ప్రణాళిక ఖరారు చేయలేదు. కాకతీయ కాల్వ ద్వారా నీటిని వదలడం లేదు. కానీ రైతుల డిమాండ్ మేరకు సరస్వతి, లక్ష్మి కాల్వల నుంచి నీటి విడుదల చేస్తున్నారు. అది కూడా వార బందీ కింద ఇస్తున్నారు. ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు దంచికొడుతున్నాయి. భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. బోర్ల ద్వారా పంటలకు నీరందని పరిస్థితి ఉంది. దీంతో వరిసాగు గణనీయంగా తగ్గింది. వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు కష్టాలు పడుతున్నారు.

ఈ సీజన్ లో 39 టీఎంసీలే..

ప్రాజెక్టు గత ఆరేళ్లుగా పూర్తిస్థాయిలో నిండింది. మిగులు జలాలు సైతం గోదావరిలోకి విడుదల చేశారు. కానీ ఈఏడాది గడ్డు పరిస్థితి నెలకొంది. వర్షాకాలం సీజన్ జూన్ 1న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ జలాశయంలోకి ఎగువ నుంచి కేవలం 39.702 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. జూన్, జులై నెలల్లో 13.255 టీఎంసీలు, ఆగస్టులో 22.399 టీఎంసీలు, సెప్టెంబరు 22వ తేదీ వరకు కేవలం 4.650 టీఎంసీలు మాత్రమే వచ్చింది.

ఏడాది – టీఎంసీలు..

2023 – 78
2024 – 80
2025 – 70
2026 – 46

ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి..

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు. కాగా మంగళవారం నాటికి 1,080.50 అడుగులకు చేరుకుంది. 46.355 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 4,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాకతీయ కాల్వ ద్వారా 5,000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 500, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 360, గుత్ప ఎత్తిపోతల ద్వారా 405, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూనెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది.

పూడికతో తగ్గిన నిల్వ సామర్థ్యం..

ప్రాజెక్ట్ లో పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు తగ్గిపోయింది. అయితే వర్షాభావం కారణంగా ఈసారి ఎల్ నినో ప్రభావంతో వరదలు రాకపోవడంతో ప్రాజెక్టులో జలకళ లేకుండా పోయింది. దీంతో ఆరు జిల్లాల్లోని లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>