కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asia Games) 2026లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సంచలన విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జపాన్ను 3-0 తేడాతో చిత్తు చేసి, మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. టోర్నీకి ముందు ఆటగాళ్లంతా కలసి చేసిన యోగా, శిక్షణ, సహా ఐక్యతా సాధన సరైన ఫలితాన్ని ఇచ్చాయి. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన లక్ష్యసేన్ అద్భుత పోరాటపటిమ చూపించారు. కొడాయ్ నరోకాపై 11-21, 21-5, 21-19 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్నారు.
మొదటి గేమ్ ఓడిపోయి, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 13-19తో వెనుకబడినప్పటికీ.. ఒత్తిడిని జయించి వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి గెలిచారు. దీంతో భారత్‌కు 1-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ మెరిసింది. తకురో హోకి-యుగో కొబయాషి జంటపై 21-18, 24-22 తేడాతో విజయం సాధించింది. తమ ట్రేడ్‌మార్క్ పవర్ఫుల్ స్మాష్‌లు, చురుకైన నెట్ప్లేతో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టి భారత్ ఆధిక్యాన్ని 2-0కి పెంచారు.
చివరిగా జరిగిన ఒంటరి పోరులో యువ ఆటగాడు ఆయుష్ శెట్టి దుమ్మురేపాడు. కోకి వతనాబేను 21-10, 21-19 తేడాతో వరుస గేమ్‌లలో ఓడించి భారత్‌కు 3-0తో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీనితో వరుసగా రెండోసారి ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల జట్టు పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్‌లో చైనా లేదా దక్షిణ కొరియాతో భారత్ తలపడనుంది. మరోవైపు, పీవీ సింధు నేతృత్వంలోని భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 1-3 తేడాతో జపాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సింధు తన మ్యాచ్‌లో అకానే యమగుచి చేతిలో ఓడిపోగా, ఉన్నితి హుడా, తన్వి శర్మ కూడా తమ మ్యాచ్‌లలో పరాజయం పాలయ్యారు. త్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ మాత్రమే విజయం సాధించింది.

