కలం, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ (KU Arts And Science Principal) సుంకరి జ్యోతిని పదవి నుంచి తొలగించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ (Swaero Students Union) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరినప్పుడు ప్రిన్సిపల్ తమను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రిన్సిపాల్ సమయపాలన పాటించడం లేదని, ప్రొఫెషనల్, నాన్-ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన అంశాలపై విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ విద్యార్థులను భయపెడుతున్నారని పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో ప్రిన్సిపాల్ తగిన గౌరవంతో వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి, వాస్తవాలు తేల్చాలని కోరారు. జ్యోతిని విధుల నుంచి తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శివకుమార్, రాజ్‌కుమార్, అభిలాష్, నాగరాజు, బంటి, సుఖేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

