కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohith Raj) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో నిమజ్జన మార్గాలు, భద్రాచలం ఘాట్, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.
శోభాయాత్రల్లో డీజేలు, అధిక శబ్దానిచ్చే సౌండ్ సిస్టమ్స్, టపాసుల వినియోగానికి అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన సమయంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని తెలిపారు. ఘాట్ల వద్ద గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని, అగ్నిమాపక, వైద్య, మున్సిపల్ శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరపాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
నిమజ్జనం భద్రంగా.. భక్తులకు అండగా! భద్రాద్రి ఎస్పీ కీలక సూచనలు

