కలం, వెబ్ డెస్క్: తన బ్లడ్ బ్యాంకుపై ఇటీవల కాలంలో వస్తున్న ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సీరియస్ అయ్యారు. ‘నా జీవితంలో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నాను. అలాగే బ్లడ్ బ్యాంకుపై కూడా వస్తున్నాయి. ఎలాంటి విరాళాలు స్వీకరించకుండానే.. సొంత కష్టార్జితంలోనే సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంకు స్థాపించాను. తాను పెట్టేది కొంత అయినా.. నా అభిమానులు అందిస్తున్న సహకారం మరవలేనిది. రక్తాన్ని అమ్ముకుంటున్నానని కొందరు చేస్తున్న విమర్శలు పూర్తిగా అబద్ధం. సినిమాల్లో తాను తీసుకునే పారితోషికతంతో సమానమైన రక్తాన్ని అమ్మడం ద్వారా సంపాదించాలంటే ఎన్ని కోట్ల ప్యాకెట్లు విక్రయించాల్సి ఉంటుంది’ అని ప్రశ్నించారు.
కష్టాన్ని నమ్ముకుంటేనే..
జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలని చిరంజీవి సూచించారు. కష్టాల్లో ఉన్నప్పుడే అవకాశాలు వస్తుంటాయని.. వాటిని తెలివితో అందిపుచ్చుకోవాలన్నారు. దేశ విదేశాల్లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నవారు కూడా సామాన్యులేనని.. వారంతా కష్టపడటం ద్వారానే పైకి వచ్చారన్నారు. తన అభిమానులు కూడా అలా ఎదగాలనేదే ఆకాంక్ష అన్నారు. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా మెగా యూత్ ఫోర్స్ ద్వారా తన అభిమానులను కలుసుకునేలా రోడ్ మ్యాప్ తయారు చేస్తామన్నారు. ఫ్యాన్స్ ను అలరించడానికి తాను నిరంతరం పనిచేస్తూనే ఉంటానని వివరించారు. సినిమాలు, అభిమానులు, సమాజ సేవ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని వివరించారు.

