రాప్తాడులో పరిటాల రవి, NTR విగ్రహావిష్కరణ.. జగన్‌కు లోకేష్ ‘మాస్ ఛాలెంజ్’!

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నేడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ శ్రేణులు, నాయకులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావుతో పాటు మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్రల కాంస్య విగ్రహాలను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నారా లోకేష్ కు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌ల ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. తనకు రక్తసంబంధీకులైన అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు లేకపోవచ్చు కానీ, పార్టీ మహానాయకుడు ఎన్టీఆర్ తనకు రాష్ట్రంలో దాదాపు కోటి మంది కార్యకర్తల రూపంలో ఒక కుటుంబాన్ని ఇచ్చారని వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, అలాంటి అరాచకాలను, హింసను ధైర్యంగా ఎదుర్కొని భూస్థాపితం చేసిన గొప్ప నాయకుడు పరిటాల రవి (Paritala Ravi) అని కొనియాడారు.

జగన్‌కు మాస్ ఛాలెంజ్!

విజయవాడ శాప్ ఆఫీసు వద్ద నిరసనలు చేస్తున్న టీచర్లపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. వైసీపీకి చెందిన రౌడీ మూకలే ఇలాంటి విచక్షణారహిత చర్యలకు పాల్పడుతున్నాయని, టీచర్లపై దాడికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. తమ ప్రభుత్వ పారదర్శకతను గుర్తుచేస్తూ, తాము ఎప్పుడూ నీతి నిజాయితీగా బతికామని, మెగా డీఎస్సీ నిర్వహణ , ఉద్యోగాల భర్తీపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై చర్చకు సిద్ధమా? అని బహిరంగ సవాల్ విసిరారు.

పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే గెలుపు అని నారా లోకేష్ (Nara Lokesh) ధీమా వ్యక్తం చేశారు . స్థానిక ఎన్నికల్లో దాదాపు 94 శాతానికి పైగా స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తమ కుటుంబ సభ్యుడేనని, నాయకుల మధ్య ఎలాంటి చిన్నచిన్న సమస్యలు ఉన్నా నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, కార్యకర్తలను భావి నాయకులుగా తీర్చిదిద్ది వారికి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Also Read : కూతురి వివాహానికి, రాజకీయాలకు ముడిపెడితే ఊరుకోను: వైఎస్ షర్మిల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>