వెలికట్ట భూములపై క్షేత్రస్థాయిలో సర్వే.. రైతులకు నోటీసులు జారీ!

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా కొండపాక మండలం వెలికట్ట (Velikatta) గ్రామ శివారులోని రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న 271 సర్వే నంబరులోని 327.09 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు, హద్దుల నిర్ధారణ కోసం రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే (Land Survey) ప్రారంభించారు.

గజ్వేల్ డివిజన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ వంశీ ఆధ్వర్యంలో 16 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం క్షేత్రస్థాయిలో భూమి కొలతలు చేపడుతోంది. ఇటీవల తెలంగాణ శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలికట్ట (Velikatta) భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు. సర్వే నంబర్ 271లోని పాశి సత్యనారాయణ (మాజీ సైనికుడు), శ్రీనివాసాచారి (స్వాతంత్య్ర సమరయోధుడు)లకు కేటాయించిన దాదాపు 6 ఎకరాల అసైన్డ్ భూమిని BRS నేత, హరీష్ రావు మామ హనుమంతరావు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినట్లు అసెంబ్లీ వేదికగా ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ అంశంపై రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం 327.09 ఎకరాల ప్రభుత్వ భూమిని స్పష్టంగా గుర్తించి హద్దులు సూచించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

రైతులకు నోటీసులు జారీ

సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గాను, సంబంధిత సర్వే నంబరులో ఉన్న పలువురు రైతులకు రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. సదరు రైతులు తమ వద్ద ఉన్న భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ బుక్కులు, ఒరిజినల్ పత్రాలతో సర్వే నిర్వహించే ప్రదేశానికి హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. భూముల కచ్చితమైన విస్తీర్ణం, ఆక్రమణలు ఉంటే వాటి వివరాలు తేల్చేందుకు సర్వే కొనసాగుతోంది.

Also Read : ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. అత్యంత బాధాకరం: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>