కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జూరాల ప్రాజెక్టు (Jurala Project) ఆయకట్టు కింద ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా బీజేపీ చేపట్టిన జూరాల ప్రాజెక్టు సందర్శనను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) తీవ్రంగా ఖండించారు.
గద్వాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు, బీజేపీ యువ నాయకురాలు డీకే స్నిగ్ధా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బండల వెంకట్రాములు, వెంకటేశ్వర్ రెడ్డి తదితర జిల్లా నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పక్షాన బీజేపీ నిరంతరం పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. జూరాల ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలు నీరందక ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
“రైతుల పంటలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలి. రైతుల సమస్యలను పరిష్కరం చూపకుండా, శాంతియుతంగా నిరసన తెలిపే నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమే” అని ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు (Ramchander Rao) పిలుపు మేరకు జూరాల ప్రాజెక్టు సందర్శనకు సిద్ధమవుతున్న బీజేపీ నాయకులను ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. జూరాల ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతున్నాయని, రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
రైతుల సమస్యలను పరిష్కరించకుండా నాయకులను గృహనిర్బంధం చేయడం ద్వారా రైతుల గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే వరకు బీజేపీ రైతుల పక్షాన తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
Also Read : ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం
Follow Us On: X(Twitter)

