కలం, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు. పిల్లల వార్డులో ఒక్కసారిగా ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో పేలిపోవడంతో దట్టమైన పొగలు కమ్ముకుని, ఐదు రోజుల పసికందు సహా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ దురదృష్టకర సంఘటనలో తమ పసిపిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫైర్ సేఫ్టీ, విద్యుత్ భద్రతా చర్యలను తక్షణమే పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రులలోని ఎమర్జెన్సీ , ఐసీయూ వార్డుల్లో సురక్షిత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

