కేటీఆర్‌కు రేవంత్ చెక్.. సిరిసిల్లలో కాంగ్రెస్ స్కెచ్!

కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటిస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. అందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన ఈ నెల 30న సిరిసిల్లలో పర్యటించనున్నారు. అదే రోజు అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ఏర్పాట్లపై మంత్రులు సహా జిల్లా నేతలు, కార్యకర్తలు దృష్టిసారించారు.

కల్వకుంట్ల కుటుంబం భూకబ్జాలకు పాల్పడిందంటూ ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ఆరోపించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. సిరిసిల్ల సభలో మరిన్ని భూబాగోతాలను బయటపెట్టే అవకాశం ఉన్నది. కేటీఆర్‌‌పై ఉన్న భూదోపిడీ ఆరోపణలను ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆయనను కార్నర్‌‌ చేసే చాన్స్ ఉంది. గత ప్రభుత్వంలో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్ కింద గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకు భారీ స్థాయిలో నిధులు విడుదల చేసి.. ఇతర నియోజకవర్గాలను విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి లెక్కలను కూడా ఈ సభ ద్వారా సీం వెల్లడించే అవకాశం ఉన్నది.

కేటీఆర్‌‌ కార్నర్‌‌గా సభ

సిరిసిల్ల నియోజకవర్గానికి దాదాపు పాతికేళ్లుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అక్కడ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. సన్నిహితులు, అనుచరులకు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కేటీఆర్ కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిని సభలో సీఎం రేవంత్ ప్రస్తావిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. = సిరిసిల్లలో ఇసుక మాఫియా ఆగడాలు, ఆ మాఫియాను ప్రశ్నించినందుకు టిప్పర్లతో తొక్కి చంపించడం, నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురిచేయడం.. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ అంశాలనూ ప్రస్తావించి కేటీఆర్‌‌ను సీఎం కార్నర్ చేస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

పాతికేళ్లుగా కేటీఆరే ఎమ్మెల్యే

సిరిసిల్ల నియోజకవర్గానికి దాదాపు పాతికేండ్లుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ డెవలప్‌మెంట్ చేసినట్లుగా ఆయన చెప్పుకుంటున్న అంశాలను సీఎం ప్రస్తావించనున్నారు. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు, అందులోని అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, బీఆర్ఎస్ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం, పలువురు గులాబీ లీడర్లు ఆస్తులు, భూములను పోగేసుకోవడం.. ఇలాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించే అవకాశమున్నది.

ఇప్పటికే స్టేట్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు పేరును అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy).. ఆయన ఎక్కడెక్కడ భూములు కబ్జా చేసిందీ వివరించారు. ఈ వివరాలన్నింటినీ సిరిసిల్ల సభ వేదికగా మరోసారి ప్రస్తావించి ఇంకొందరి పేర్లను కూడా బయటపెట్టే చాన్స్ ఉంది. గత ప్రభుత్వంలో సిరిసిల్ల కేంద్రంగా జరిగిన భూదోపిడీని సీఎం ప్రజలకు వివరిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పాతికేళ్లుగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఆ నియోజకవర్గ పరిధిలో అనుయాయులకు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

అక్రమాలు.. దాడులు

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో బీఆర్ఎస్ నాయకుల పాత్ర, మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి పడిన గండి, కోట్లకు పడగలెత్తిన గులాబీ లీడర్లు, మాఫియాను ప్రశ్నించినందుకు టిప్పర్లతో తొక్కి చంపించిన ఘటనలు, నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురిచేయడం.. ఇలాంటి అంశాలన్నింటినీ సీఎం సిరిసిల్ల సభ ద్వారా వెల్లడించే అవకాశమున్నది. బతుకమ్మ చీరల తయారీలో జరిగిన గోల్‌మాల్, నాణ్యత లేని చీరలకు భారీ స్థాయిలో ప్రజాధనం ఖర్చు, చేనేత కార్మికులకు ఇచ్చే బీమాలో జరిగిన అక్రమాలు.. వీటన్నింటినీ వేలెత్తి చూపే అవకాశమున్నది.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనం దుర్వినియోగం చేయడం, భూముల ఆక్రమణకు పాల్పడడం తదితర అంశాలను సీఎం ప్రస్తావించనున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో నియోజకవర్గానికి కేటాయించినా.. అభివృద్ధికి కోసం చేసిన ఖర్చు తక్కువేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ నిధులపై లెక్కలతో సహా వెల్లడించే అవకాశం ఉంది. అసెంబ్లీ వేదికగా కేవలం భూముల కబ్జా గురించి లెక్కలు చెప్పిన సీఎం.. ఈ సభ ద్వారా నియోజకవర్గంలో కేటీఆర్‌ను నైతికంగా, పొలిటికల్‌గా కార్నర్ చేసే అవకాశమున్నది.

సభకు నేతల సన్నాహాలు

సీఎం సిరిసిల్ల సభను గ్రాండ్ సక్సెస్ చేయడంపై జిల్లా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు జరగబోయే సభ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రారంభ సూచకంగా ఉంటుందని, మళ్లీ ఎన్నికల ప్రచారం వరకు ఈ వేడి కొనసాగేలా సీఎం ప్రసంగం ఉంటుందన్నది జిల్లా నాయకుల అభిప్రాయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలతో పాటు పలువురు మంత్రులు కూడా సభ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు.

నకిరేకల్ సభ తరహాలో సూపర్ హిట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనికి కొనసాగింపుగా సిద్దిపేటలో సైతం హరీశ్‌రావు, కేసీఆర్ టార్గెట్‌గా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన. ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు, మంత్రులకు సిద్దిపేట సభ బాధ్యతలను అప్పజెప్పే అవకాశమున్నది. కల్వకుంట్ల కుటుంబ భూదోపిడీని ప్రజల్లో బహిర్గతం చేయడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌కు గ్రౌండ్ లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్. సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో సీఎం ఏయే అంశాలను లేవనెత్తుతారు? ప్రజల్లో అవి ఏ తరహాలో చర్చనీయాంశమవుతాయి? ఆ పార్టీ గ్రాఫ్ మరింత పతనమవుతుందా? అనేది కీలకంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>