కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ (Janasena) రెడీ అవుతోంది. ఇందులో భాగంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కాకినాడ వేదికగా ఈరోజు కీలకమైన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ కార్యాచరణపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ కీలక సమావేశానికి రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక పోరులో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కేడర్‌ను సమాయత్తం చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే ఎన్నికల బరిలో కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, బీజేపీలతో కలిసి సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పవన్ కళ్యాణ్ నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు చేయనున్నారు. ఈ మేరకు స్థానిక స్థాయిలో ఎలాంటి విభేదాలకు తావులేకుండా, కూటమి విజయాన్నే లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని పిలుపునివ్వనున్నారు.

