కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా తూప్రాన్ (Tupran) మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ప్రత్యక్షమైన ఓ ఎర్ర బ్యానర్ లేఖ (Red Banner Letter) కలకలం రేపింది. కార్యాలయ ప్రధాన గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ హెచ్చరిక లేఖను అంటించి వెళ్లడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ లేఖను ‘APTH అలెగ్జాండర్’ పేరిట విడుదల చేశారు. పది మంది విప్లవ యోధులకు విధించిన ఉరిశిక్షను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఉరిశిక్షలు వేయడం ద్వారా ప్రభుత్వాలు భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని, కానీ విప్లవ పోరాటాలను ఎంతమాత్రం ఆపలేరని హెచ్చరించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సందర్బంగా తమ మొదటి లేఖను రాశామని, ఇప్పుడు విడుదల చేసింది రెండవ లేఖ అని అందులో వెల్లడించారు. మున్సిపల్ గేటుకు ఎర్ర బ్యానర్ లేఖ వేలాడుతుండటాన్ని గమనించిన సిబ్బంది, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

