కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గంజాయి సాగు (Cannabis Cultivation) గుప్పుమంటోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుకు ఆనుకొని ఉమ్మడి జిల్లా ఉండటంతో దళారులు ముందస్తు ఒప్పందాలతో గంజాయి సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా కామారెడ్డి (Kamareddy) జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలో అంతర పంటగా గంజాయి సాగు చేసిన ముగ్గురు కౌలు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 400 మొక్కలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. కామారెడ్డిలో ఎక్కువగా సాగు చేస్తుండగా నిజామాబాద్ (Nizamabad)లో వినియోగం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
రైలు, రోడ్డు మార్గాలే రాచబాట..
రైలు, రోడ్డు మార్గాలను గంజాయి స్మగ్లర్లు రాచబాటగా చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణాలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉండడం, వీటి మీదుగా జాతీయ రహదారులు, రైలు మార్గాలు వెళ్తుండడంతో గంజాయి రవాణా సులువుగా మారింది. రెండు జిల్లాల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎండు గంజాయిని చిన్న ప్యాకెట్లులో నింపి ఒకటి రూ.400 నుంచి రూ.500కు అమ్ముతుండడం, ఇటీవల కామారెడ్డి జిల్లాలో కొందరు మైనర్లు పోలీసులకు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.

