కలం, తెలంగాణ బ్యూరో: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులతో పాటు ఆ పార్టీ నేతలు భారీ స్థాయిలో భూదోపిడీకి పాల్పడ్డారంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లెక్కలు చెప్పారు. దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మూడు రోజులుగా ఎర్రవల్లి, జన్వాడ, అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌ల బాట పట్టారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించి ఫామ్‌హౌస్‌లను నిర్మించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతల ఆక్రమణలపై ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం బీఆర్ఎస్‌ను డ్యామేజ్ చేస్తున్నదనే అభిప్రాయంతో కౌంటర్ స్ట్రాటజీకి గులాబీ లీడర్లు (BRS Strategy) శ్రీకారం చుట్టారు.
గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ అంశాన్ని తీసుకుని ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. కేసీఆర్ హయాంలో 24 గంటలు సరఫరా అయితే ఇప్పుడు 8 గంటలు కూడా రావడం లేదని ఆరోపిస్తున్నారు. దీన్ని ధ్రువీకరించడానికి సబ్ స్టేషన్లలోని ‘లాగ్‌బుక్’లను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని సబ్ స్టేషన్లను విజిట్ చేసిన హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ‘‘ఒకవైపు సాగునీరు ఇవ్వడం లేదు.. మరోవైపు బోరు బావుల ద్వారా సాగు చేసుకోవాలని భావిస్తే వ్యవసాయ విద్యుత్‌ను సప్లై చేయడం లేదు” అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైవర్ట్ చేసే ప్లాన్..
అసెంబ్లీ వేదికగా సీఎం లెక్కలతో సహా బీఆర్ఎస్ భూకబ్జాల గురించి లెక్కలు చెప్పడంతో ప్రజల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. ‘పదేండ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిన నిర్వాకం ఇదేనా?’ అంటూ ప్రజల మధ్య ఓపెన్‌గానే చర్చలు మొదలయ్యాయి. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉన్న 388 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ను సర్వే చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులతో స్థానిక దళితులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. మూడు రోజులుగా ఫామ్‌హౌస్ విజిట్ ప్రోగ్రామ్ చేపట్టిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతోనూ లోకల్ పబ్లిక్ మాట్లాడుతున్నారు.
ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి నెగెటివ్‌గా మారడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసమే రైతుల అంశాన్ని, వ్యవసాయ విద్యుత్ సప్లై ఇష్యూను టేకప్ చేసి డైవర్షన్ ప్లాన్ చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ను ప్రజల్లో పల్చన చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహమైతే, దీనివైపు ప్రజలు డైవర్ట్ కాకుండా వ్యవసాయ విద్యుత్ అంశంతో తిప్పికొట్టాలన్నది బీఆర్ఎస్ ప్లాన్.
గతంలో కోమటిరెడ్డి..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని గొప్పలు చెప్పుకున్నది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్‌ప్రైజ్‌గా ఒక సబ్ స్టేషన్‌కు వెళ్లి.. వ్యవసాయానికి ఎన్ని గంటల విద్యుత్ సరఫరా అవుతున్నదో లెక్కలు తీశారు. ఇదే అంశాన్ని అసెంబ్లీ వేదికగా చర్చనీయాంశం చేశారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని బీఆర్ఎస్ నేతలు ఎంచుకున్నారు.

