వరంగల్ మిల్స్‌ కాలనీ.. నిఘా మిస్సింగ్‌!

కలం, వరంగల్‌ బ్యూరో: వరంగల్‌లోని మిల్స్ కాలనీ (Warangal Mills Colony) పోలీస్‌స్టేషన్‌ తాజాగా వరుస ఘటనలతో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల కింద ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లోనే పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని చనిపోయాడు. తాజాగా మరో వ్యక్తి పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రెండు ఘటనలూ కుటుంబ, దంపతుల గొడవల కారణంగానే జరిగాయి. అయితే.. దంపతుల మధ్య తలెత్తిన వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరిన తర్వాత పరిస్థితులు మారి విషమించే స్థాయికి వెళ్తోంది? కుటుంబ కలహాలను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌, సమన్వయం చేసే వ్యవస్థ ఎక్కడ? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

రౌడీల వర్గపోరు అదుపుచేసినా.. కానీ..

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు రౌడీషీటర్ల ఆధిపత్యంతో కూడిన చరిత్ర ఉంది. రెండు దశాబ్దాల కింద ప్రత్యర్థి వర్గాల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉండేవి. దాడులు, హత్యల వంటి దారుణాలు జరిగేవి. అప్పటి పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రౌడీషీటర్ల కదలికలపై, నేరస్తులపై నిఘాపెట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం చిన్న వివాదాలు కూడా తీవ్ర రూపం దాల్చుతున్నాయంటే.. పోలీస్‌ ల ముందస్తు నిఘా వ్యవస్థ విఫలమైందనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అక్రమ దందాలపై ఆరోపణలు..

మిల్స్ కాలనీ పరిధిలో గంజాయి, గుట్కా, మట్కా, బెల్ట్‌ షాపులు, గుడుంబా అమ్మకాలకు అడ్డాగా మారింది. అక్రమ కార్యకలాపాల్లోనూ కొందరు పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు గొడవపడిన ఘటన కూడా పోలీస్‌స్టేషన్‌ పనితీరుపై చర్చకు దారితీసింది. సిబ్బంది మధ్యే వివాదం చోటు చేసుకోవడం, అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరుస ఘటనలతో స్టేషన్‌ లో పర్యవేక్షణ ఎలా ఉంది? ఉన్నతాధికారుల నియంత్రణ ఎంతమేర ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవి నిజమా? కాదా? అనేది తేల్చాల్సిన బాధ్యత కూడా పోలీసు ఉన్నతాధికారులపైనే ఉంది. క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి తనిఖీలు చేసి వాస్తవ పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సకాలంలో చర్యల్లేవ్..

మిల్స్ కాలనీ పరిధిలో జరిగిన ఘటనలను లైట్ గా తీసుకుంటే భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత నేరస్తుల కదలికలు, సమస్యాత్మక ప్రాంతాలు, అక్రమ కార్యకలాపాలు, కుటుంబ వివాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముందని కోరుతున్నారు. పరిస్థితి చేయిదాటిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే నిఘాపెట్టి అడ్డుకట్ట వేయాలని పేర్కొంటున్నారు. ఇందుకు ప్రత్యేక పర్యవేక్షణ, బీట్‌ వ్యవస్థను బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపడంతో పాటు కుటుంబ వివాదాలు తీవ్రకాకుండా సకాలంలో జోక్యం చేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికైనా స్పందిస్తారా?

మిల్స్ కాలనీలో ఒకప్పుడు రౌడీలుగా చలామణి అయిన వ్యక్తులు ఇప్పుడు రాజకీయ నేతలు, పోలీసుల అండదండలతో సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడుతున్నట్లు ప్రచారంలో ఉంది. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు ప్రజాప్రతినిధులు చెప్పినట్టుగానే జీ హుజూర్ అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి కార్యకలాపాలపై పోలీస్ ఉన్నతాధికారులు నిఘా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>