పీఆర్సీ నివేదికపై ఉత్కంఠ.. నేడు ఉద్యోగుల జేఏసీతో సీఎస్‌ చర్చలు

కలం, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై చీఫ్‌ సెక్రటరీ సోమవారం ఉద్యోగుల జేఏసీతో సమావేశం కానున్నారు. జేఏసీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ల చార్టర్ సమర్పించింది. పీఆర్సీ (Telangana PRC), పెండింగ్‌ డీఏల చెల్లింపు, ఓపీఎస్‌ అమలు ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

అయితే పీఆర్సీ చైర్మన్‌ శివశంకర్‌ ఇప్పటివరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించకపోవడంతో ఫిట్‌మెంట్‌పై చర్చ ఎలా జరుగుతుందన్నది ఉద్యోగుల్లో ప్రధాన సందేహంగా మారింది. పీఆర్సీ నివేదిక అందకపోవడంతో ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి చర్చలకు హాజరుకావాలా? లేక నివేదిక అందని కారణంగా ఫలితం ఉండదంటూ బహిష్కరించాలా? అనే చర్చ జేఏసీలో జరుగుతోంది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.

ఐదు డీఏలతో 12.74% బకాయిలు

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ నేతృత్వంలో 2023 అక్టోబర్‌ 2న పీఆర్సీ ఏర్పాటైంది. దాని గడువును ప్రభుత్వం పలుమార్లు పొడిగిస్తూ వస్తున్నది. గత వారం చీఫ్‌ సెక్రటరీతో జేఏసీ ప్రతినిధుల సమావేశంలో పీఆర్సీ నివేదికను వెంటనే సమర్పించేలా చైర్మన్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 18న జరగాల్సిన సమావేశం అసెంబ్లీ సమావేశాల కారణంగా 21వ తేదీకి వాయిదా పడింది. అయినప్పటికీ నివేదిక ఇంకా అందలేదు.

దీంతో ఫిట్‌మెంట్ విషయంలో చర్చలకు ప్రాతిపదికే ఉండదని ఉద్యోగులు వాదిస్తున్నారు. 2021 జనవరి 1 నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకటి చొప్పున ఈ ఏడాది జూన్‌ నాటికి ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని జేఏసీ తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 12.74 % బకాయిలు రావాల్సి ఉందని ఆదివారం చీఫ్‌ సెక్రటరీ కార్యాలయానికి నోట్‌ పంపింది. కేంద్రం ప్రకటించే డీఏకు అనుగుణంగా రాష్ట్రం డీఏను ఖరారు చేయడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వ డీఏల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు 14% వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 12.74% ఫిక్స్ చేసింది. ఈ ఏడాది జులై నుంచి మరో డీఏ రావాల్సి ఉన్నా కేంద్రం నుంచి ప్రకటన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోలేదు.

51% ఫిట్‌మెంట్‌.. 5% ఐఆర్‌ డిమాండ్‌

పీఆర్సీ ఎంత ఫిట్‌మెంట్‌ సిఫారసు చేస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖరారు చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. గత ప్రభుత్వంలో బిశ్వాల్‌ నేతృత్వంలోని పీఆర్సీ 7.5 % ఫిట్‌మెంట్‌ సిఫారసు చేయగా ప్రభుత్వం 30 % ప్రకటించింది. ఇప్పుడు కనీసం 51 % ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని జేఏసీ డిమాండ్‌ చేస్తున్నది. కనీసం సగమైనా రాకపోతుందా అనే ఆశలు ఉద్యోగుల్లో ఉన్నాయి. ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకునేలోపే 5 % ఐఆర్‌ (మధ్యంతర భృతి) ఇవ్వాలని కోరుతోంది. సీపీఎస్‌(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను పూర్తిగా రద్దు చేసి ఓపీఎస్‌ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) అమలు చేయాలని కూడా జేఏసీ డిమాండ్‌ చేస్తున్నది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఈ హామీ ఉన్నందున అమలు చేయాలని ముఖ్యమంత్రిపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. చీఫ్‌ సెక్రటరీ స్థాయి సమావేశంలో ఈ డిమాండ్లపై నిర్ణయాలు తీసుకుంటారా? లేక ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని ప్రభుత్వం మరోసారి వాయిదా వేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణపై జేఏసీ నిర్ణయం తీసుకోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>