కలం, వెబ్ డెస్క్: రహదారి భద్రత పట్ల అంకితభావంతో వ్యవహరిస్తూ, దశాబ్దాల కాలంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా వాహనాలను నడుపుతున్న ఆరుగురు డ్రైవర్లను ప్రభుత్వం ఉత్తమ పురస్కారాలకు ఎంపిక చేసింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం 2026 సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ డ్రైవర్ల (Best Drivers) తో పాటు జోనల్ స్థాయిలోనూ నగదు పురస్కారాలను ప్రకటించింది. వీరికి త్వరలోనే ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుంది.
రాష్ట్ర స్థాయి ఎంపికలు
రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానానికి ఫరూక్ నగర్ డిపోకు చెందిన కె. రాందాస్ ఎంపికయ్యారు. ఈయన గత 34 ఏళ్ల 6 నెలల సర్వీసులో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా వాహనాన్ని నడిపి రికార్డు సృష్టించారు. వీరికి 12,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. ద్వితీయ స్థానానికి కల్వకుర్తి డిపోకు చెందిన బి. అంజయ్య ఎంపికయ్యారు. ఈయన 33 ఏళ్ల 11 నెలల పాటు సురక్షిత ప్రయాణాన్ని అందించినందుకు గాను 10,000 రూపాయల పురస్కారాన్ని అందుకోనున్నారు. తృతీయ స్థానానికి సిద్దిపేట డిపోకు చెందిన బి. ఎస్. రెడ్డి ఎంపికయ్యారు. 33 ఏళ్ల 5 నెలల పాటు ప్రమాద రహిత సేవలందించిన వీరికి 8,000 రూపాయల నగదు బహుమతి లభించనుంది.
జోనల్ స్థాయి ఎంపికలు
వీరితో పాటు మరో ముగ్గురు ఉత్తమ డ్రైవర్ల (Best Drivers)ను జోనల్ స్థాయిలో పురస్కారాలకు ఎంపిక చేశారు. కోరుట్ల డిపోకు చెందిన ఎస్.డి. యూసుఫ్, దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఎ. సూర్య కుమార్, సిద్దిపేట డిపోకు చెందిన ఎస్. వెంకటయ్యలకు ఒక్కొక్కరికి 4,500 రూపాయల చొప్పున నగదు పురస్కారాలు అందజేయనున్నారు. వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ కు నిదర్శనంగా నిలిచిన ఈ డ్రైవర్లను అధికారులు, తోటి సిబ్బంది అభినందించారు. త్వరలో జరగనున్న కార్యక్రమంలో వీరు ఈ పురస్కారాలను స్వీకరించనున్నారు.
Read Also: మైలేజా? డ్యామేజా? హాట్ టాపిక్ గా KCR అటెండెన్స్
Follow Us On : WhatsApp


