కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) ప్రయాణిస్తున్న వాహనం మేడ్చల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా రేకబావుల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రేకబావుల సమీపంలో అడ్డుగా వచ్చిన మరో కారును ఎంపీ అరవింద్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో అక్కడ ఉన్న వారికి, అలాగే ఎంపీకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం అనంతరం ఎంపీ స్వయంగా వాహనం నుంచి బయటకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అక్కడి పరిస్థితులను సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ ఘటనతో మేడ్చల్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, రెండు వాహనాలకు జరిగిన నష్టం తదితర అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

