రెండేళ్ల ముందే రణం: హీటెక్కిన నిజామాబాద్ రాజకీయం!

కలం, నిజామాబాద్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైనే సమయం ఉండగానే నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు (Nizamabad Politics) మొదలుపెట్టాయి. జిల్లాలో ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేల పనితీరుపై జోరుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎవరు సూపర్, ఎవరు యావరేజ్ ..? అంటూ పలు ప్రశ్నలతో ప్రజల నుంచి సమాధానాలు సేకరించే పనిలో పడ్డాయి.

ప్రజల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో రాజకీయ పార్టీల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. సర్వేలను రాజకీయ పార్టీలతో పాటు ప్రజాప్రతినిధులే స్వయంగా చేయిస్తుండగా, బయటకు మాత్రం పలు సంస్థల పేర్లు వినిపిస్తుండడంతో కొద్దిరోజులుగా జిల్లాలో రాజకీయ వాతావరణం మారిపోయింది. నేతలు ఎవరి వ్యూహాల్లో వారు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టగా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మళ్లీ పోరు నెలకొంది.

పనితీరుపై సర్వే

జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుపై ఓ ప్రముఖ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, గత కొన్నిరోజులుగా ప్రస్తుత ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, గత ప్రభుత్వ పనితీరుపై ఇప్పటికే అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ సర్వేలు చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోగా మెజార్టీ స్థానాలు గెలుపొందిన అధికార కాంగ్రెస్ వచ్చే స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సిద్ధమవుతుండగా, అదే స్థాయిలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అయ్యాయి.

బలాబలాలు.. కొత్త వ్యూహాలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని 5 స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్, మరో రెండు చోట్ల బీజేపీ, ఒక సీటులో బీఆర్ఎస్ గెలుపొందాయి. బాన్సువాడ సెగ్మెంట్ లోని మండలాలు జిల్లాలోనే ఉన్పప్పటికీ నియోజకవర్గం మాత్రం కామారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపొందినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.

పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ రెండో సారి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు అధికార కాంగ్రెస్ గెలిచినప్పటికీ గతంలో కంటే ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. బీఆర్ఎస్ సైతం పలు చోట్ల తన పట్టును నిలుపుకుంది.

పబ్లిక్ పల్స్ ను పట్టుకునేందుకు..

ప్రజలు తమ పార్టీ పనితీరు గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు నేతలు ఇప్పటికే రెండు సార్లు సర్వేలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉండేది..? ఏ ప్రభుత్వం బాగుంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి, ఏ నేతకు ఓటు వేస్తారు..? అంటూ సుమారు 10 ప్రశ్నలతో సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

కొన్నాళ్లుగా కామ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గత 15 రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగడుతునే నియోజకవర్గాల్లో మంచి చెడు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ రెండేళ్లు ప్రజల్లో ఉండేందుకు మాజీ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తుండగా, ప్రస్తుత ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు ప్రజల్లో ఉండేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

హీటెక్కిన పాలిటిక్స్

జిల్లాలో 15 రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వెయ్యి రోజుల పాలనపై అధికార పార్టీ నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాల్లో విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ బాకీ కార్డుల పేరుతో ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమాలు చేస్తోంది. బీజేపీ కూడా ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర ప్రభుత్వ వైఫల్యాలతో ఆందోళన చేపడుతోంది. మొత్తంగా ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శల దాడిని పెంచగా అధికార పార్టీ సైతం అదే స్థాయిలో సమాధానం చెబుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>