కలం, జోగులాంబ గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం తమ భవిష్యత్‌ను అంధకారంలో నెట్టేసేలా తీసుకొచ్చిన జీవో 97(GO 97)కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల (Polytechnic Students) భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న జీవో 97ను రద్దు చేసే వరకు తాము పరీక్షలు రాసేది లేదని డిమాండ్ చేస్తూ శుక్రవారం గద్వాల మండలం గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
మిడ్ పరీక్షలు బహిష్కరించడంతో పాటు, తరగతులకు కూడా పోయేదీ లేదన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి జరగనున్న మిడ్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌కు విద్యార్థులంతా సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పరీక్షలు రాసేది లేదని స్పష్టం చేశారు. ఇది ఒక్క గోనుపాడు కళాశాలకే పరిమితమైన సమస్య కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు జీవో 97 రద్దు కోసం నిరసన చేపడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

