కలం, వనపర్తి: ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అజెండాతో ప్రజలకు బాధ్యతాయుత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం వనపర్తి కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం జిల్లా ప్రగతి నివేదికను విప్ పట్నం మహేందర్ రెడ్డి చదివి వినిపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద వనపర్తి జిల్లాలో 3.84 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు. రూ.500కే గ్యాస్ పథకం ద్వారా 85,383 మంది లబ్ధిదారులకు 5,12,439 సిలిండర్లు పంపిణీ చేసిందన్నారు. వడ్డీలేని రుణాల కింద స్వయం సహాయక సంఘాలకు రూ.10.88 కోట్లు మంజూరు చేశామన్నారు.
702 మంది రైతులకు బీమా..
రైతు బీమా ద్వారా 702 మంది రైతుల కుటుంబాలకు రూ.35.10 కోట్లు, రైతు భరోసా కింద రూ.212.32 కోట్లను 1,82,768 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి వివరించారు. జిల్లాలోని కర్నేతండా ఎత్తిపోతల పథకం పూర్తయి 4,235 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన 5,874 ఇళ్లలో 92 శాతం నిర్మాణం పూర్తయిందన్నారు. గృహజ్యోతి పథకం కింద 85,423 కుటుంబాలకు 21.60 లక్షల జీరో బిల్లులు జారీ చేశామన్నారు. చేయూత పథకం ద్వారా ప్రతి నెలా 70,342 మందికి నెలకు రూ.16.33 కోట్ల పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం..
వనపర్తి జిల్లాకు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.47.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వైద్య రంగంలో జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి రూ.203.95 కోట్లు, పెబ్బేరు, ఆత్మకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
భూ భారతి కింద జిల్లాలో స్వీకరించిన 12,851 దరఖాస్తుల్లో 11,403 పరిష్కరించినట్లు చీఫ్ విప్ పట్నం వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 2,221 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్య నాయక్, వినోద్‌కుమార్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మాధవి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

