కలం, వెబ్‌డెస్క్: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ (KCR) కుటుంబం భూ దోపిడీపై చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. కేసీఆర్‌ను భూ బకాసురుడిగా పేర్కొంటూ ఆయన ఆస్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పోస్టుకు గతంలో కేసీఆర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను జోడించారు. 2004లో కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్‌కు ఒక్క ఎకరం భూమి కూడా లేదని, కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో, ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్లలో వేల కోట్ల విలువైన ఆస్తులు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు అప్పులే మిగిలాయని, కల్వకుంట్ల కుటుంబం మాత్రం ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకుని లక్షల కోట్ల ఆస్తులు కూడగట్టుకుందని విమర్శించారు.
పుట్టుకతోనే కేసీఆర్‌కు వందల ఎకరాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చెబుతున్న మాటలను పొంగులేటి తప్పుపట్టారు. కేటీఆర్ మాటలు నిజమైతే కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారా? లేక ఇప్పుడు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా? అని నిలదీశారు. సున్నా ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తులకు ఎదిగిన కేసీఆర్ కుటుంబం అఫిడవిట్లతో అడ్డంగా దొరికిపోయిందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.

