కలం, కరీంనగర్: దేశభక్తి పేరుతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించాలని చూస్తున్న బీజేపీకి విమోచన దినోత్సవం జరిపే నైతిక హక్కు లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) హెచ్చరించారు. సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం కరీంనగర్ (Karimnagar) లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద జాతీయ జెండాను, సీపీఐ జెండాను పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిందని ప్రజలందరికీ తెలుసు కానీ ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం సిద్ధించిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తూ ఇక్కడి ప్రజలచేత వెట్టి చాకిరి చేపిస్తూ, బానిసలుగా చూస్తూ, ఎదిరించిన వారి ప్రాణాలను తీస్తున్న నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేతలు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముక్దుం మొహియుద్దీన్ లాంటి నేతలు 1947 సెప్టెంబరు 11న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని అన్నారు. ఆ పిలుపునందుకొని గ్రామగ్రామాన సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రజలు చైతన్యవంతులై నిజాం నవాబు, రజాకార్ పోలీసులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. ఆ మహత్తర పోరాటం మూలంగా 3వేల గ్రామాలు విముక్తికై 4వేల 5వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘన చరిత్ర సీపీఐకే దక్కిందన్నారు.
ఉద్యమాలకు పురుడుపోసిన కరీంనగర్ గడ్డపై పుట్టిన బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వ్యక్తుల్లో ఒకరని, ఆ పోరాటానికి, దళానికి నాయకత్వం వహించింది తెలంగాణ భగత్ సింగ్‌గా పేరొందిన వ్యక్తి అనభేరి ప్రభాకర్ రావు అని అన్నారు. రజాకార్ పోలీసుల తూటాలకు బలై ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసిన అనభేరి ప్రభాకర్ రావు ప్రాణత్యాగం వెలకట్టలేనిదన్నారు. అలాంటి వీరుల త్యాగాలను, చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్న వారిని, సంస్థలను సీపీఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తూ, చరిత్రను కాపాడుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మహత్తర పోరాట ఘట్టాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు బండ రాజిరెడ్డి ,బీర్ల పద్మ, బూడిద సదాశివ, శాఖ కార్యదర్శులు కాంతాల తిరుపతి రెడ్డి, కసిబొజుల సంతోష్ చారి, నూనునావత్ శ్రీనివాస్, సావనపెల్లి నాంపల్లి, నాయకులు ఆవునూరి రమేష్, తిరుపతి, బీర్ల స్వాతి, సందీప్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

