కలం, నిర్మల్: బ్రిటిష్, నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన వీరుల త్యాగాలకు నిర్మల్ గడ్డకు ఘనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర వెనకాలే కన్నీళ్లతో కూడిన విషాదానికి సాక్ష్యమూ ఉంది. రాంజీ గోండు (Ramji Gond), ఆయన అనుచరుల పోరాటం, త్యాగం చిరస్థాయిగా నిలిచిపోయాయి. నెలల తరబడి బ్రిటీష్, నిజాం సైన్యంతో పోరు సాగించారు. వీర మరణం పొందారు. ఆ తర్వాతి కాలంలో జల్, జంగల్, జమీన్ అంటూ పోరాడిన కుమ్రంభీమ్‌కు స్ఫూర్తిగా నిలిచారు. ఇంతటి పోరాటం సాగించిన రాంజీ, అతని అనుచరుల చరిత్ర కనీసం పాఠ్యపుస్తకాలకు కూడా ఎక్కేందుకు నోచుకోవడంలేదు.
అడవినే అడ్డాగా చేసుకుని..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండు వీరుడు మర్సుకోల రాంజీ గోండు బ్రిటిష్, నిజాం పాలకులపై అడవులను కేంద్రంగా చేసుకుని పోరాడారు. గిరిజనులపై వెట్టిచాకిరీ, పన్నుల భారం, అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి ఉద్యమించారు. 1857 తిరుగుబాటు అనంతరం కొందరు రోహిల్లా సైనికులు కూడా అండగా నిలిచినట్లు చరిత్ర చెబుతోంది.
రాంజీ గోండు పోరాటాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు కఠిన చర్యలకు దిగారు. 1860 ఏప్రిల్ 9న రాంజీ గోండుతో పాటు ఆయన అనుచరులను నిర్మల్ జిల్లా కేంద్రంలో కురాన్నపేట్ నుంచి ఎల్లపల్లికి వెళ్లే దారిలో భారీ మర్రిచెట్టు వద్ద ఉరితీశారు. ఒకే చెట్టుకు పెద్ద సంఖ్యలో వీరులను ఉరితీసిన ఘటనను తరతరాలుగా స్థానికులు గుర్తు చేసుకుంటారు. ఆ మర్రిచెట్టు ఊడలు విస్తారంగా వ్యాపించి ఉండటంతో దానికి ‘వెయ్యి ఊడల మర్రి’, ‘వెయ్యి ఊరుల మర్రి’ అనే పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కాలక్రమంలో ఆ మహావృక్షం నేలకొరిగినా, వీరుల జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోలేదు.
చెట్టు లేకున్నా.. చరిత్ర సజీవమే
నేడు ఆ మహా వృక్షం కనిపించకపోయినా అక్కడి స్మారక చిహ్నం నాటి వీరుల త్యాగాలను గుర్తుచేస్తూనే ఉంది. మర్రిచెట్టు కూలిపోయింది. కానీ, దాని నీడలో రాసిన చరిత్ర మాత్రం కూలిపోలేదు. గిరిజన హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలను అర్పించిన రాంజీ గోండు (Ramji Gond), ఆయన సహచరుల పోరాటం నిర్మల్ గడ్డ చరిత్రలో ఓ చెరగని అధ్యాయంగా మిగిలింది.
నేటికీ చరిత్రకెక్కని పోరాటం..
ఇంతటి వీరోచిత పోరాటం సాగించిన రాంజీ గోండు, ఆయన అనుచరుల త్యాగం నేటికీ చరిత్ర పుటల్లో తగిన స్థానం పొందలేదనే ఆవేదన స్థానికుల్లో ఉంది. కాలం గడుస్తున్నా.. వారి త్యాగాలకు గుర్తుగా నిలిచే జ్ఞాపకాలు మాత్రం అరకొరగానే మిగిలాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిర్మల్ కు వచ్చి రాంజీ గోండు స్మారక స్థలంలో నివాళులర్పించి వెళ్లారు. అయినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని చైన్‌గేట్ సమీపంలో ఉన్న చిన్న విగ్రహం, 1995లో గాలివానకు నేలకొరిగిన ‘వెయ్యి ఉరుల మర్రి’ ప్రాంతంలో ఉన్న అమరవీరుల స్థూపం మినహా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ జ్ఞాపక చిహ్నాలు లేవు.
మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినా..
రాంజీ గోండు పేరిట మ్యూజియం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ, అది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. నాటి పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు మ్యూజియం, స్మారక ప్రాంగణం, చారిత్రక వివరాలతో కూడిన వేదిక ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో.. తమ పూర్వీకుల త్యాగాలకు గుర్తింపు లభిస్తుందేమోనని రాంజీ గోండు, అమరవీరుల వారసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

