కలం, వెబ్‌డెస్క్: 2029 ఎన్నికల్లో పొత్తులు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో తనకు ఉన్న అనుబంధంపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ తాజాగా నెల్లూరు జిల్లాలోని కోవూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పెద్ద కుటుంబం అని, కోటి ఆరు లక్షల మంది సభ్యులు తమ కుటుంబంలో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ, జనసేనతో ఇంకొంచెం పెద్ద కుటుంబంలా మారిందన్నారు. తమకు ఎలాంటి క్రాస్‌ఫైర్, మిస్ ఫైర్, విడాకులు లేవని, నాయకత్వం విషయంలో తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు.
తనకు ఎలాంటి సందేహాలు, ఇబ్బందులు ఉన్నా పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేస్తానని లోకేశ్ అన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఏ సమయంలో అయినా తనకు ఫోన్ చేసి మాట్లాడతారన్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తనను 2029లో కూడా జనసేనతో కలిసి పోటీ చేస్తారా అని ప్రశ్నించారని, దానికి తప్పకుండా కలిసే పోటీ చేస్తామని చెప్పానని లోకేశ్ అన్నారు. అయితే ఆ తర్వాత తనకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరో మూడు సార్లు కలిసి పోటీ చేద్దాం అంటుంటే నువ్వు ఒక్కసారే అని ఎందుకు చెప్తున్నావని అన్నారని గుర్తు చేశారు. కార్యకర్తలు, నాయకులకు పొత్తుల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.

