కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలను అందించేందుకు పోలీసులు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ డి. జానకి (SP Janaki) పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం (Praja Palana Dinotsavam) సందర్భంగా గురువారం జోగులాంబ జోన్–VII డీఐజీ కార్యాలయం, మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పోలీసు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడం, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే విధంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య, టూటౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్, రూరల్ సీఐ గాంధీ నాయక్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

