కలం, వెబ్డెస్క్: పాకిస్థాన్ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్ల బెడద (Drone Intrusions) పెరిగినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏకంగా 791 సార్లు డ్రోన్లు పాక్ సరిహద్దు నుంచి లోపలికి చొరబడడానికి ప్రయత్నించిన సంఘటనలు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. మొత్తం డ్రోన్ చొరబాటు ఘటనల్లో 9 జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరగ్గా, మిగిలినవి పంజాబ్, రాజస్థాన్లో జరిగాయి. వీటిలో 237 డ్రోన్లను సరిహద్దులోని భారత సైన్యం కూల్చేసింది. ఇందులో ఐదు డ్రోన్లు యుద్ద సామగ్రితో,72 మాదకద్రవ్యాలతో ఉన్నాయి. 161 డ్రోన్లలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, సామగ్రి లేవు. సరిహద్దులో ఏర్పాటుచేసిన స్పూఫర్లు, జామర్లు డ్రోన్ల ముప్పును గణనీయంగా తగ్గించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. కాగా, ఒకప్పుడు పాక్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి అక్రమంగా చొరబడేవాళ్లు. ఇప్పుడు ఆ ముప్పు చాలా వరకు తగ్గింది. దీంతో పాక్ కొత్త కుయుక్తులకు తెరతీసి, డ్రోన్లను ప్రయోగిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.


