కలం, జోగులాంబ గద్వాల: నడిగడ్డ ఇలవేల్పుగా కొలిచే శ్రీ జమదగ్ని సమేత శ్రీ జమ్ములమ్మ అమ్మవారి కల్యాణోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల పండువగా జరిగాయి. శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా జమ్మిచేడులోని (Jammichedu) శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (Bandla Krishna Mohan Reddy) దంపతులు అమ్మవారికి సంప్రదాయ ప్రకారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే దంపతులతో పాటు ఆయన తనయుడు బండ్ల సాయి సాకేత్‌రెడ్డి దంపతులు, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బోయ వెంకట్రాములు, ఆలయ ఈఓ పురేందర్ కుమార్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మధ్యాహ్నం 12.15 గంటలకు జమదగ్ని మహర్షి చేతుల మీదుగా జమ్ములమ్మ అమ్మవారికి మాంగళ్యధారణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మామిడి తోరణాలు, అరటి ఆకులతో అలంకరించిన పచ్చటి పందిరిలో స్వామి, అమ్మవార్ల కల్యాణం భక్తులను ఆకట్టుకుంది.
ఆలయ అభివృద్ధికి కృషి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నడిగడ్డ ప్రజల ఇలవేల్పుగా కొలిచే జమ్ములమ్మ (Jammulamma) అమ్మవారి ఆరో వార్షిక కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారని తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు, భవిష్యత్తులో జమ్ములమ్మ ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రముఖుల ప్రత్యేక పూజలు
జమ్మిచేడు(Jammichedu)లో జరిగిన జమ్ములమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత తిరుపతయ్య హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
జమ్ములమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు జమ్మిచేడుకు తరలివచ్చారు. కల్యాణోత్సవాన్ని భక్తులు దగ్గరగా వీక్షించేలా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఎస్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులు అక్షింతలు వేసుకుని స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Also Read : 823 రోజులు మాత్రమే, వదిలిపెట్టం.. కేటీఆర్ ఆగ్రహం
Follow Us On: X(Twitter)

