కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఆవరణలో సోమవారం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై జరిగిన ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా 823 రోజుల సమయం మాత్రమే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయంగా వాడుకుంటున్నారు..
స్పీకర్ కులాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకులు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ (KTR) విమర్శించారు. స్పీకర్‌ను ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదని, అయితే తన వ్యాఖ్యలు ఆయనకు వర్తిస్తాయని భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎమ్మెల్సీ తాతా మధు ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పై దాడికి యత్నించారు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నివాసం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై కూడా కేటీఆర్ స్పందించారు. పోలీసుల భద్రత మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తాము తమ నాయకుడిని కలిసేందుకు వెళ్తుండగా అరెస్టు చేసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారని తెలిపారు. తాము చట్టాలను గౌరవిస్తూ పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు తమపై దాడికి ఇతరులను ప్రేరేపించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు చట్టం, న్యాయవ్యవస్థపై గౌరవం లేదని విమర్శించారు.
తెలంగాణ గుండెను గాయపరిచారు..
కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నామంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని కేటీఆర్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే వ్యక్తిగతంగా మరణాన్ని కోరుకోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. తమ నాయకుడిపై, పార్టీ నేతలపై జరుగుతున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చట్టపరమైన, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు.
Also Read : జమ్ములమ్మ కల్యాణం.. జమ్మిచేడులో ఆధ్యాత్మిక సందడి
Follow Us On: X(Twitter)

