కలం, జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని జగిత్యాల (Jagtial) బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అర్బన్, రూరల్ మండల కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవోలకు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నాయకులు ప్రభుత్వ హామీల అమలు తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నప్పటికీ అనేక హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.
హామీల అమలులో జాప్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని వారు కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించి, పెండింగ్లో ఉన్న హామీలను దశలవారీగా అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, హామీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రజల తరఫున నిరంతరం ప్రశ్నిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దావ సురేష్, జగిత్యాల పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శీలం సురేందర్, మల్లా రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు, సాగర్ రావు, సన్నిత్ రావు, మోహన్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

