కళ్లు లేని అంధులు.. కరుణ లేని పాలకులు!

​కలం, ఖమ్మం బ్యూరో : ​భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాగబోయినగూడెం పంచాయతీ పరిధిలోని తెలగగుంపు (తంగెళ్లగడ్డ) గ్రామంలో ఒకే ఇంట్లో నలుగురు అంధులు జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. భర్తను కోల్పోయిన ఈసం కన్నమ్మ కు ఒక కుమారుడు వెంకటేశ్వర్లు, ఇద్దరు కుమార్తెలు అనిత, పార్వతి ఉన్నారు. ఈ కుటుంబానికి (Blind Family) ఉన్న ఏకైక జీవనాధారం వారి 4 ఎకరాల సాగుభూమి.

అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువు పునరుద్ధరణ పేరుతో అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని నీటిని మళ్లించడంతో, అది కాస్తా చెరువు నీట మునిగింది. భూమి కోల్పోయిన ఈ అంధుల కుటుంబానికి (Blind Family) తగిన నష్టపరిహారం చెల్లించడంలో రెవెన్యూ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.​ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం ఈ కుటుంబాన్ని మరింత రోడ్డున పడేసింది.

కుటుంబ యజమాని చనిపోతే వయస్సు ఎక్కువైందనే కారణంతో ‘రైతు బీమా’ను తిరస్కరించగా, అంతకుముందు సామాజిక పింఛన్ కోసం వెళ్తే వయస్సు తక్కువంటూ అధికారులు వెనక్కి పంపారు. చివరకు వైఎస్ఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు కూడా ప్లాస్టరింగ్ పూర్తికాక అసంపూర్తిగానే మిగిలిపోవడంతో, వర్షానికి కురుస్తూ, చలికాలంలో వణుకుతూ ఆ నలుగురు దివ్యాంగులు అల్లాడిపోతున్నారు.

​అధికార యంత్రాంగం పట్టించుకోని వేళ, కారేపల్లి మండలం చీమలపాడు(Cheemalapadu)కు చెందిన రిటైర్డ్ టీచర్ ఉపేందర్ రెడ్డి మానవత్వంతో ముందుకు వచ్చారు. ఆయన ప్రతి నెలా తన సొంత ఖర్చులతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ కడుపు నింపుతున్నారు. ఆ కుటుంబంలో ఒకరికి హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో కంటి ఆపరేషన్ చేయించడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. అయితే చూపులేని ఈసం కన్నమ్మ, వెంకటేశ్వర్లు, అనిత, పార్వతిలను హైదరాబాద్ వరకు తీసుకెళ్లే సహాయకుడు లేక ఆ వైద్యం ముందుకు సాగడం లేదు.

​ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ సమస్యపై దృష్టి సారించాలని బాధితులు వేడుకుంటున్నారు. నీట మునిగిన భూమికి నష్టపరిహారం అందించి, కంటి ఆపరేషన్ కోసం ప్రభుత్వ సహాయకుడిని కేటాయించాలని కోరుతున్నారు. అలాగే అసంపూర్తి ఇంటిని పూర్తి చేయించి, ఇంట్లోని అంధులందరికీ దివ్యాంగుల పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read : తెలంగాణలో SIR గడువు పొడిగింపు..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>